30, డిసెంబర్ 2013, సోమవారం

నా మేనకోడలికి.....!!


పబ్బులు పార్టీలు అంటూ ఆముల్యమైన సమయాన్ని వృధా చేసుకుంటున్న ఎందరో యువతలో భాగం కాకుండా తమలోని సృజనాత్మకతను మెరుగు పరచుకుంటూ... మొదటి ప్రయత్నంలోనే విజయ కేతనాన్ని ఎగురవేసిన బృందం...ప్రతిభకు ఎల్లలు లేవని చాటుతున్న ఈనాటి యువతరంగాలు... వారిలో నా మేనకోడలు ప్రవల్లి ఒకటై నందుకు సంతోషంతో...  మును  ముందు మరిన్ని మహోన్నత శిఖరాలు అందుకోవాలని... మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ.... నా మేనకోడలికి ప్రేమతో అభినందనలు ...
మంజు అత్త
 ( అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఆ కబుర్లు ఈ కబుర్లు అంటూ తీపి చేదు రుచుల నా కబుర్లు కాకరకాయలు అన్ని టపాలు కలిపి దీనితో ఆరు వందల టపాలు.... నా ఆరు వందల టపా నా ఒక్కగానొక్క మేనకోడలికి అభినందనల టపా కావడం యాదృచ్చికమే అయినా ఆ సంతోషంతో పాటు ఈ ఆనందము పంచుకోవడం భలే బావుంది నాకయితే....!! )

29, డిసెంబర్ 2013, ఆదివారం

అర్ధం లేని బంధాన్ని...!!

గతమంతా రాశులు రాశులుగా పోసి ఉంది
ఆ గుట్టలలో బోలెడు జ్ఞాపకాల గురుతులు
ఎన్నని వెదికేది ఎక్కడని చూసేది
రోజుల తరబడి పేరుకున్న నిధిలో
నీ సన్నిధికి చోటెక్కడ ఉందో...!!
వెదికిన రోజులు మరుగున పడలేదు
చూడని క్షణాలు దాయనూ లేదు
జరిగిన కాలం మరపుకు చేరువ కాలేదు
వాస్తవానికి దగ్గరగానూ రావడం లేదు
గతించిన గతంలో సజీవ చిత్రం నీ రూపు
చితికిన ముక్కల్లో నన్ను చూసి నవ్వుతోంది
పట్టుకోలేవంటూ పారిపోతోంది ఎక్కడికో...!!
మనసు మాటను చెప్పని మౌన వీచికను
మనో విహంగాన్ని ఆపలేని మరీచికను
రాగాల తోటలో విహరించే రంగుల రాగమాలికను
అనుబంధాలకు అర్ధాన్ని వెదికే అర్ధం లేని బంధాన్ని...!!

మన ఖర్మకి మనమే భాద్యులము...!!

ఏ కన్నతల్లి పిల్లలని చెడ్డవారుగా కావాలని పెంచదు....మనం ఇష్టపడి బంధాన్ని పెంచుకుని కష్టం వచ్చిందని ఆ బిడ్డను కన్నతల్లిని నిందించడం ఎంత వరకు సబబు చెప్పండి..!! మన అవసరానికి అత్తను మామను వాడుకుని మనకంటూ ఓ గొప్ప పట్టా వచ్చాక మన ఉన్నతి కోసం మన పిల్లల ఆలనా పాలనా చూసిన వారిని మర్చిపోవడం...!! మన ఇంటి విషయంలో వారిని నిందించడం...!! పెంచిన పిల్లలని చూడకూడదని ఆంక్షలు పెట్టడం..!! తాతల ఆస్థి మనవలకు చెందాలి కాని కంటితో చూసుకునే భాగ్యం మాత్రం లేదు..పెంచిన ప్రేమను చంపుకోమనడం...ఆ ముసలి ప్రాణాలు ఎంత క్షోభను అనుభవిస్తాయో.... కాపురాలు కూలిపోయిన బాధ ఓ పక్కా... కనీసం మనవలను చూసుకోలేని దౌర్భాగ్యం... వీటికి తోడూ ఈ శూలాల లాంటి మాటలు....తట్టుకోగలవా....ఆ ప్రాణాలు...!!
మీరు ఇష్ట పడినప్పుడు అంతా మంచిగానే కనిపించింది ఇద్దరిలో ఇద్దరికీ... ఉన్నప్పుడు బయటి ప్రపంచంతో పని ఉండదు అనుకుంటా...ఒక్కసారిగా భాద్యతలు బంధాలు వచ్చేసరికి డబ్బులు ముఖ్యం అయ్యి ఎదుటి వారిలో లోపాలు చూడటం మొదలు అవుతుంది...చిన్నవే భూతద్దంలో పెద్దవిగా చేసుకుని ఏ ఒక్కరు సరిపెట్టుకోలేక తమకున్న అహాన్ని వదులుకోలేక ఎంతగానో ఇష్ట పడిన బంధాన్ని తెంచుకుని పిల్లలని బలి పశువులను చేస్తూ తమతో ముడివేసుకున్న అనుబంధాలను వదిలించుకుంటూ... తమ దారిన తాము పోతూ కన్నవాళ్ళను పెంపకం గురించి ప్రశ్నిస్తారు...!! ప్రేమించినప్పుడు గుర్తుకు రాని పెంపకం విడిపోయినప్పుడు గుర్తుకు వస్తుంది మరి...అదేంటో...!!
నేను పొరపాటుగా ఈ మధ్యనే ఒక మాట అనేసాను..  అది అనుకోకుండా వచ్చేసింది...ఈ లోకంలో లేని ఆ తల్లిని అనడం నా తప్పే....ఆవిడని అనాలని ఎప్పుడు లేదు కాని కోపంలో పొరపాటుగా  అలా వచ్చేసింది...ఈ లోకంలో లేని ఆ తల్లికి ఇలా నా క్షమాపణలు చెప్పుకుంటున్నాను...నా తప్పుని మన్నించమని మనస్పూర్తిగా అడుగుతున్నా...!! అందుకే పెద్దలు చెప్పిన మాటలు గుర్తు ఉంచుకోవాలి మనం " కాలు జారితే తీసుకోగలం కాని మాట జారితే వెనక్కు తీసుకోలేము" అని ... తల్లి మనసు ఎప్పుడు ఏ తల్లిదయినా ఒకేలా ఉంటుంది...మన తప్పులకు కన్నతల్లులను నిందించకూడదు.....!! మన ఖర్మకి మనమే భాద్యులము...!! జారిపోతున్న జీవితపు విలువలు అన్ని డబ్బుతో ముడి పడి పోతూ ఆధునికత ముసుగులో కొట్టుకు పోతున్నాయి....రాను రాను రోజులు ఎలా ఉంటాయో...కనీసం అమ్మా నాన్న బంధాలు కూడా పుస్తకాల్లోనో లేదా నీతులు చెప్పే నీతి  చంద్రికలలోనో పరిమితం అయిపోతాయేమో...!!

హృదయపూర్వక అభినందనలు.....!!





 మీ అందరి అభినందనల ఆశీస్సులు కూడా నా మేనకోడలికి అందించండి.... ఎంత కష్టపడుతుందో చూడండి ...-.:)
హృదయపూర్వక అభినందనలు ప్రవల్లి ...      
మరెన్నో అలవి కాని వింతలు సాధిస్తూ
ఉన్నత శిఖరాలను అందుకోవాలని
మనసారా కోరుకుంటూ .....
ప్రేమతో
మంజు అత్త                    

ప్రయాణమా... పైకి పోవడమా....!!

ప్రయాణంలో పదనిసలు అని ఒకప్పటి మాట...మరి ఇప్పుడో మనకి తెలియకుండా చనిపోవడానికి చక్కని ప్రయాణ ప్రమోద మార్గం...!! ప్రయాణమా... పైకి పోవడమా....!! అనిపిస్తోంది...ప్రతి రోజు జరుగుతున్న ఈ ఘోరాలు చూస్తుంటే...ఇంట్లో ఉన్నా ఎప్పుడు ఏ దారిలో వస్తుందో తెలియని వింతలా మృత్యువు తలుపు తట్టకుండా వచ్చేస్తోంది....ప్రశాంతంగా నిద్ర పోయే సమయంలో ఇంట్లోకి లారీల భూతాలు...చల్లగా ఉంటుంది కదా అని శీతల వాహనాల్లో ఖరీదైన ప్రయాణాలు కాస్త జాగ్రత్తగా ఉంటాయని మనం అనుకుంటుంటే అవే మన ప్రాణాలను ఖరీదుకు అమ్మేస్తున్నాయి.... రూపంలో సహాయ నిధుల కింద...!! లోపం ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఎన్ని బస్సు , రైలు ప్రమాదాలు జరిగినా ప్రభుత్వాలు అన్ని నిమ్మకు నీరెత్తినట్టుగా మా పరిధి కాదు అని కేంద్రం, మాకు సంబంధం లేదు అని రాష్ట్రాలు తప్పించుకుంటున్నాయి...ప్రభుత్వ,  ప్రైవేటు సంస్థలు కాస్తయినా వాళ్ళ వాళ్ళ లాభాల గురించి ఆలోచించడం మానేసి ప్రయాణికుల క్షేమాన్ని కాంక్షిస్తే ఈ ఘోరాలు కాస్తయినా తగ్గుతాయి...అన్ని లంచాలతో కలుషితం అయిపోయి డబ్బులకు అమ్ముడు పోయి జనాల ప్రాణాలతో మాడుతున్నాయి... ఓ రకంగా ఇందుకు మనము భాద్యులమే అనిపిస్తుంది...మన పని తొందరగా అవడం కోసమో... మరొకందు కోసమో డబ్బిచ్చి మనమే అలవాటు చేస్తున్నామేమో...!! అంతా సరిగా ఉందొ లేదో అని సరి చూడాల్సిన అధికారులు నామ మాత్రంగా చేసి కనీసం తాము తీసుకునే జీతానికి కూడా ఆ కాస్త పని చేయకుండా ఇలా జనం ప్రాణాలతో ఆడుకుంటున్నారు....!! మీ మీ అవసరాల కోసం అమాయక ప్రాణాలను బలిగొనవద్దని వేడుకుంటున్నాము...!!

27, డిసెంబర్ 2013, శుక్రవారం

నీ చెంతకు చేరగా...!!

కనుల ఎదుట నీవుంటే కవితల్ల నా తరమా
మనసు నిండ నీవుంటే మరపు నా వశమా

మౌనంగా నీవుంటే మౌన కావ్యాలు నా కవనాలా
చెంతనున్న నీ తలపే విడలేని బంధమాయనా

మాటలన్ని నీవైతే అక్షరాలు నాకందేనా
ఊహలన్ని నీవైతే ఊసులన్ని నావేనుగా

మువ్వల సవ్వడి నాదైతే ముగ్ధత్వం నీదేనుగా
సరాగాలు నీవైతే కోయిల రాగాలు నావేనుగా

గోధూళి సంబరం నాదైతే పండు వెన్నెల నీదేనుగా
జ్ఞాపకాలు చెంతనుంటే గతమంతా నీవేనుగా

వెదుకులాటల వెతలలో అలసిన ఆనందం నీ చెంతకు చేరగా...!!

26, డిసెంబర్ 2013, గురువారం

రజతోత్సవం జరుగుతున్న రోజు....!!

సరిగ్గా ఈ రోజుకి అంటే డిసెంబరు ఇరవై ఆరుకి రెండు వర్గ పోరాటాల మధ్య సామాన్యులు, అమాయకులు నష్ట
పోయిన జీవితాలకి పాతిక సంవత్సరాలు నిండి రజతోత్సవం జరుగుతున్న రోజు.... బెజవాడ  తో సహా చుట్టుపక్కల జిల్లాలు, కోస్తా లోని చాలా ఊళ్ళు ఇప్పటికి మర్చిపోలేని రాక్షసత్వానికి ప్రతీకగా మిగిలిపోయిన రోజు....రెండు రౌడి వర్గాల మధ్య జరిగిన హత్యా రాజకీయాలు ఎందరికో శోకాన్ని..మరెందరికో జీవితాల్ని లేకుండా చేసినరోజు...!!
రంగా, మురళి ఎవరో కూడా తెలియని ఎందఱో ఈ క్రీడలో బలి అయ్యారు... అలా నష్ట పోయిన ఊళ్ళలో ఒకటి మా ఊరు కూడా.. జరిగి పాతిక ఏళ్ళు అయినా తలచుకుంటే ఇంకా నా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటుంది ఆ రోజు... అంతకు ముందు రోజే మా అరుగుల మీద కూర్చుని అందరికి పీపుల్ ఎన్ కౌంటర్ పుస్తకంలో ముద్రగడ పద్మనాభం ఇంటర్వూలో  "రంగా కి ఏమైనా జరిగితే ఆంధ్రా లో మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది" అని చదివి వినిపిస్తూ ఎవరీ రంగా ఏంటి గొడవ అనుకున్నా...మరుసటి రోజు పొద్దున్నే గోల గోలగా ఉంది అవనిగడ్డలో సూర్యనారాయణ గారి రైస్ మిల్లు తగలబెట్టారు అని కాస్త  వెళ్లి చుస్తే బాగా పొగలు కనిపించాయి...మన ఊఋ కుడా వస్తారంట అందరు జాగ్రత్తగా ఉండండి అని అనుకుంటున్నారు అందరు...మధ్యాన్నం రానే వచ్చింది.. సాయంత్రం నాలుగు ఐంది అనుకుంటా కారం పొట్లాలు ఆడవాళ్ళను  ఊరి మధ్యలో గుడి దగ్గరకు రమ్మని చెప్పారు అందరిని.. తీరా వెళితే ఏముంది అక్కడ చుట్టూ అన్ని తలకాయలే కనిపించాయి నల్లగా కనుచూపు మేరా.... అప్పటికే అందరు పొలాల్లోకి పారిపోయారు... ఇంట్లో అందరమూ అన్ని దారులు అయ్యాము..పొలాల్లో దాక్కున్నాము...నేను మా ఇంటి దగ్గర అక్క వాళ్ళతో వెళ్తూ వాళ్ళ ఇంట్లో నుంచి అక్క వాళ్ళ అమ్మాయి కర్చీఫ్ లు మాతరం తెచ్చింది.. అర్ధరాత్రి వరకు అక్కడే ఉన్నాము... నాకేమో నోరు ఊరుకుని చావదాయే ఏదో ఒకటి ఆ టైములో కూడా జోక్స్ వేస్తూనే ఉన్నా కాస్త భయం పోగొట్టడానికి అన్నట్టుగా....పాపం అందరు టెన్షన్ లో ఉన్నారుగా మమల్ని తిట్టారు...ఈ లోపల మా నాన్న వాళ్ళు వెదుక్కుంటూ వచ్చారు.. వాళ్ళు మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని పిలుస్తుంటే విళ్ళేమో పలకొద్దంటారు... మొత్తానికి ఊళ్లోకి వెళ్తే ఏముంది అక్కడ చుట్టూ మంటలు, నిప్పులు, పొగలు... ఊరు మొత్తం తగలబెట్టేసారు.... పెంట కుప్పలతో సహా...!! ఇద్దరినీ చంపేశారు.. కొంత మందిని బాగా కొట్టారు...మా ఇంటికి ఏం కాలేదు కాని తా రోజు వేయని భయం తరువాత నెల రోజులు నిద్ర పొతే ఒట్టు... నాలుగైదు రోజులు చీకటి పడితే చాలు ఇంట్లో ఎవరిని ఉండనివ్వలేదు నేను... అంతా చుసానేమో బాగా భయం వేసింది..నాలుగైదు కుటుంబాలు మా ఇంట్లోనే ఉన్నారు..రోజు ఖాళి లేకుండా వచ్చి చూసి పోయేవారికి లెక్కే లేదు... సంక్రాంతికి ముందు కొందరైతే అరిసెలు, ఇంకా ఏవో తెచ్చి పంచి పెట్టారు.. మా ఇల్లు బానే ఉంది మాకు వద్దు అంటే ఇలా ఉంది మీరేం చేసుకుంటారు అని బలవంతంగా ఇచ్చి పోయారు....చాలా అందంగా ఉండే మా ఊరు బూడిద కుప్పలా మారిపోయింది...!! ఎందుకో టి వి చూస్తుంటే నాకు ఆ రోజు జరిగింది గుర్తు వచ్చి ఇలా మీతో పంచుకుంటున్నా....!!

25, డిసెంబర్ 2013, బుధవారం

అభిలాష మహోజ్వలనం గురించి నా మాటలు....!!

తన అక్షర భావాలపై పొగడ్త అయినా విమర్శ అయినా ఏదైనా సరే తను విజయాన్ని అందుకున్నట్టే అని చెప్పిన  అభి మాటల్లోనే అది పోగరో, అహంకారమో, ఆత్మాభిమానమో లేక తను నమ్మిన సత్యానికి తన విజయమో....!!
ఈ మహోజ్వలనంలో పుట్టిన అక్షర శులాలు చాలా మంది గుండెలను గుచ్చుతున్నాయి...గెలిపించే ఆయుధాన్ని అందుకుని మనిషిలోని శత్రువులను, మిత్రులను మనసు విజయానికి అలంకారాలుగా చేసి అమ్మ  అమృతాన్ని చవి చూపించి మాత్రుత్వపు మమకారాన్ని అద్భుత వరంగా ఆవిష్కరించి, తనలోని మనసు మాటలను, భావ జాలాలను, భేషజాలు లేని నిష్కల్మష నిర్మల హృదయాన్ని పరచి, తన భావాల ఆశలతో మనలను మాటలాడించి నేను నాలానే ఇలానే ఉంటాను అంటూ గెలుపు పిలుపు బావుటాను ఎగురవేస్తాను నా మాటలే నా ఆయుధాలు అని చెప్తూ... తెలుగు రాజసాన్ని చక్కని తీయని తేనెల మాటల్లో చెప్పి... నాస్తికత్వంలో ఆస్తికత్వాన్ని చూసే అందమైన వ్యక్తిత్వం ముందు...ప్రేమలోని ఆర్తిని, ఆద్రతను కొత్త కోణంలో చూపి... మనిషి మనసు అశలనువివిధ రంగులలో చెప్పి .. మనసు నాటకాన్ని విశదికరిస్తూ... లోకపు పోక ళ్ళను, దేవుని మాయలను, సమాజపు వింత కట్టుబాట్లను ప్రశ్నిస్తూ... ఆత్మాభిమానాన్ని అమ్ముకోవద్దని తన ఇస్టాన్ని నిక్కచ్చిగా చెప్పిన అభి ధైర్యం అభినందించదగినది...!!
ఆక్రోశంలో రగిలే ఆవేశం పొంగులెత్తి దేవుణ్ణి కూడా ధిక్కరించి మనసు మాయను చూపించి నిజాల నిప్పులతో ఆటలాడి విజయాన్ని చవి చూడమని చెప్తూ...అప్పుడప్పుడు తన లోకంలోకి వెళిపోతూ తన అభిమాన ధనాన్ని చూపిస్తూ మనిషి అర్ధాన్ని మార్చవద్దని అడుగుతూ... ఆడపిల్లను ఆడ పిల్లగా చూడవద్దని వేదనను వెళ్లగక్కుతూ... పెద్దరికాల లోపాలను చూపిస్తూ... నిదురను దూరం చేసి అలుపెరుగని అద్భుతాన్ని అందుకోమంటూ... నిజమైన దేవుని నమ్మిన పనిలో చూడమని చెప్పిన.... ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో భావాలు కనిపిస్తాయి ప్రతి కవితలోనూ...
ప్రకృతి అందాలను, ప్రేమ పార్శ్వాలను తన మనసుతో చూసి.. తన ముక్కుసూటి  తనాన్ని, ఆత్మాభిమానాన్ని, పొగరుని, వగరుని తలెత్తుకుని గర్వంగా చెప్తూ నేను ఇలానే ఉంటాను అనే అభి నమ్మిన దాన్ని ఎవరేమనుకున్నా నాకేంటి అంటూ నిర్భయంగా తను నమ్మిన నిజాల్ని చెప్పే అభి ముందు ముందు మరిన్ని మహా జ్వాలలు పుస్తకాలుగా ఆవిష్కరించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ .....
                                                                                            ప్రేమతో
                                                                                         మంజు అక్క

ఇక అందరు ఆ పనిలో ఉండండి....!!

ఎందుకొచ్చిన బాధలు, ఆవేశాలు, కోపాలు, కష్టాలు, కన్నీళ్ళు... మనకు మనసు ఉంది అనుకుంటేనే కదా ఇవి అన్ని...!! అందుకే ఆ మనసు మనలో లేదని ఓ క్షణం అనుకుని చూస్తే పోలా...!! అసలు చిక్కల్లా మనకు ఈ మనసుతోనే... మనం ఇష్టపడినా... ద్వేషించినా....దేనికయినా దీని మాట వింటేనే అది మనల్ని బానిసలుగా చేసుకుంటూ మనతో ఆడుకుంటోంది...!! అందుకే మనసుని పక్కన పెడితే ఎలా ఉంటుంది...!! ఎలాగు అందరికి ఉండదనుకోండి ఈ మనసు...అది కొందరిదే కానీ అందరిది కాదు...!!
మనసున్న ఆ కొందరు దానితో తంటాలు పడుతూ దాని ఇబ్బంది పెడుతూ వారు ఇబ్బంది పడుతూ ఇష్టం ఉన్నా లేక పోయినా జీవితాన్ని సాగిస్తూ ఉంటున్నారు...అందుకే అ మనసుని మర్చి పొతే ఇక ఏ గోలా ఉండదు...!! మనం సంతోషంగా ఉండాలి అంటే మన మనసుని మర్చి పోవాలి ... ఇక అందరు ఆ పనిలో ఉండండి....-:)...!!

24, డిసెంబర్ 2013, మంగళవారం

మహోన్నత శిఖరం ...!!

అల్లరి పాపాయిలో అమ్మను చూసుకుని
అనుబంధాల ఆత్మీయతా బంధాన్ని
మమకారపు మధుర కావ్యాన్ని
తప్పటడుగుల విన్యాసాన్ని
ముద్దు ముద్దు మాటల మూటలను
మనసుతో అనుభవించి అంతలోనే
రూపాన్ని మార్చుకుని నాన్న ప్రేమతో
వ్యక్తిత్వాన్ని సంతరించుకుని
తన చేతితో మలచిన సజీవ శిల్పాన్ని చూస్తూ 
అనుభవించే ఆనందాన్ని మరో జీవితానికి
వారధిగా కొత్త తరానికి నాందిగా మార్చుకునే
తన రక్త పాశాన్ని విడలేక మనసు తపనను
ఆనంద భాష్పాలుగా చేసుకుని ఆనందించే
ఆ తండ్రి హృదయం మహోన్నత శిఖరం ...!!
అప్పుడే పుట్టిన పాపాయి అమ్మను తలపిస్తుంటే
అమ్మ ప్రేమను చవి చూసిన నాన్న తన పాపలో
అమ్మని చూసుకున్న ఆ అపురూప క్షణం...!!
పాదాలు కందకుండా అరిచేతుల్లో నడిపించిన నాన్న 
అడగకుండానే అన్ని తానైన ఆత్మీయతా బంధం
హద్దులు లేని ప్రేమమూర్తి నాన్నకు అక్షర నీరాజనం..!!

ప్రేమపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు .... !!





ప్రియమైన భావనకు....
చక్కని పాటలతో అందరిని మురిపించి
పాత పాటల హాయిని అందించే
మధుర భావ రాగాల చిన్నారి కోకిలమ్మ
బోలెడు పాటలు పాడి గాన కోకిలమ్మగా
అందరి మన్ననలు అందుకోవాలని ఆశిస్తూ....
ప్రేమపూర్వక  పుట్టినరోజు శుభాకాంక్షలు ....
                               ప్రేమతో.......
                   నిన్ను ఇష్టపడే అందరు 



                                            








23, డిసెంబర్ 2013, సోమవారం

నువ్వు నెగ్గిన ఆ క్షణం...!!

జ్ఞాపకంగా దాచేసుకుందామంటే
గతంగానే ఉండి పోతానంటున్నావు...!!
కరిగి పోయిన కాలంలో కలగా
మిగిలి చెప్పని కధగా మారిపోయావు...!!
పలకరింపుల పలవరింత మౌనంగా ఉంటే
దొరికి పోయిన నీ మది దాగిపోయింది సిగ్గుపడుతూ ...!!
నువ్వు నీకు తెలిసిపోయిన ఆ క్షణాలు
నాతో స్నేహం చేసాయి నిన్ను పరిచయం చేస్తూ...!!
వెన్నెలా వేకువలు కలిసినట్లు
శిశిర వసంతాలు చెంతనే చేరినట్లుగా బావుంది కదూ...!!
నాకు తెలియని నా జ్ఞాపకం నీలో ఉండి
ప్రపంచాన్ని జల్లెడ పట్టిన వెదుకులాటలో నువ్వు నెగ్గిన ఆ క్షణం...!!
చేజారిన చెలిమి చెంతకు చేరిన తరుణం
పుడమిని తాకిన తొలకరి చినుకుల సంబరాన్ని గుర్తు చేస్తూ...!!

22, డిసెంబర్ 2013, ఆదివారం

నా అక్షరయానం ఎప్పటికి...!!

నీ నుండి దూరంగా పారిపోయాను అనుకున్నా
దిగంతాల ఆవలకు పోయినా వెన్నంటి వస్తున్నావు....!!
రహదారులన్ని మూసేశాను నువ్వు రాకుండా
అయినా వదలకుండా వెంట పడుతూనే ఉన్నావు...!!
నీకు తెలియకుండా నాతోనే నడుస్తున్నావు
నా అడుగుల ముద్రలలో నీ పాదాల గుర్తులతో...!!
నీ తలపు గుండె గూటిలో కొలువై నాతోనే నిరంతరం
మనసుని మూసే తలుపు లేక తెరిచే ఉంచా నీ కోసం...!!
చేరువుగా లేకున్నా చెంతనే ఉండకున్నా
నాలోని నీతోనే నా అక్షరయానం ఎప్పటికి...!!
నీ ఆనవాలు ఒక్కటి చాలదూ నాలో
నీ జ్ఞాపకాల సాహచర్యంతో జీవితాంతం బతకడానికి...!!

21, డిసెంబర్ 2013, శనివారం

మనకన్నా పెద్ద నియంత....!!

మనకు ఎన్ని ఉన్నా మన దగ్గర లేని దాని గురించే మన ఆలోచనంతా ఉంటుంది... ఎందుకో మరి ఇష్టంగా కూడా అనిపిస్తుంది..అందని ద్రాక్ష పుల్లన కదా...మరెందుకో ఇలా...!! మన దగ్గర ఉన్న విలువైన దాని గురించి పట్టించుకోకుండా ఎడారి ఎండమావుల వెంట పరుగులు తీస్తూ సేదదీర్చే ఒయాసిస్సులని భ్రమ పడుతూ అలసి పోయినా కూడా...ఆయాసపడుతూ వాటి కోసం పరుగులు తీస్తూ ఉంటాము... మన నైజం ఇదేనేమో....!!
ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత....మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె సామెతలు  గుర్తు వస్తూ నవ్వు వచ్చేస్తుంది ఒక్కోసారి...మనం ఎదుటివారికి చెప్పే నీతులలో కనీసం ఒక్కటి ఆచరించినా మన జీవితం ధన్యమైనట్లే...!! మన ఒక వేలు ఎదుటి వారిని చూపిస్తే మిగతా నాలుగు వేళ్ళు మనని చూపిస్తాయి...కాని మనలోని లోపాన్ని మనకు తెలిసినట్లు ఉండకుండా అంతరాత్మ నోరు నొక్కేసి మనం చెప్పిందే వేదం అంటూ హుంకరిస్తూ మన ప్రతాపాన్ని అందరికి గుర్తు చేస్తూ గొప్పగా భావిస్తాం...ఈ రోజు మన ముందు పొగిడిన వాళ్ళే మనం కనుమరుగు కాగానే మన లోపాలను ఎత్తి చూపుతూ అవహేళన చేస్తారని మనకు తెలుసు.. అయినా అబద్డంలోనే ఆనందం బావుందని అలానే ఉండి పోతాం...నిజాన్ని దగ్గరకు రానీయకుండా...!! అందుకే నిజం అలా మనలోనే అంతర్లీనంగా లోపలే ఉండి పోతోంది...మనం ఎలా ఉంటున్నాము అని ఒక్కసారి నిజాయితీగా ప్రశ్నించుకుంటే...?? ఎప్పుడైనా మనం ఎదుటివారికి ఇచ్చేదే మనకు తిరిగి వస్తుంది...తప్పదు దాన్ని అలానే అందుకోవాలి..మనం ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారు కదా...!! కాకపొతే అందరు గాంధీలు, మథర్ తెరీసాలు ఉండరు...అందుకే మనం ఇచ్చింది మను గోడకు కొట్టిన బంతిలా తిరిగి వస్తే తీసుకోవాలి తప్పదు మరి..మనం ఇచ్చింది మనకు ఇష్టం లేక పొతే ఎలా...!! ఎంత సేపు ఎదుటి వారిలో లోపాలు వెదక కుండా కాస్త మంచిని చూడగలిగితే మనసుకు జీవితానికి ప్రశాంతత వస్తుంది...మనమే నియంతలం అనుకుంటే మనకన్నా పెద్ద నియంత ఒకడు ఉన్నాడు వాడు మన లెక్కలు వేస్తూనే ఉంటాడు ఎప్పటికప్పుడు...!! అర్ధం ఐంది కదూ ఆ నియంత ఎవరో....!! -:)

ఈ ప్రయాణం....!!

నేల రాలిన జీవితం పక పకా నవ్వుతోంది
మరచిపోయిన గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ...!!
వాడిపోయిన వాసంతం ఎదురు చూస్తోంది
కొత్త చివురుల పలకరింపుల తొలకరి కోసం....!!
చెరిగి పోయిన అక్షరం మసకగా మారింది
నే రాసుకున్న నా తలరాతను తలపిస్తూ...!!
కోపాల శాపాలు నా చుట్టూనే తిరుగుతున్నాయి
వరదల వెల్లువగా మారి ఊపిరి అందకుండా...!!
మనసు శకలాల శిధిలాలు అలానే ఉన్నాయి
మోసపోయిన జీవితానికి రాతి కట్టడంలా....!!
కలల గోదారి గంభీరంగా సాగిపోతూనే ఉంది
సుడిగుండాల ఆటుపోట్లు తట్టుకుంటూ...!!
ఒంటరి పయనానికి అలవాటైన ఈ ప్రయాణం
చేరాల్సిన గమ్యం వెదుకు కుంటూ...!!

20, డిసెంబర్ 2013, శుక్రవారం

మరల చూస్తూ...!!

తరలిరాని కాలంతో పరుగు
మరలిరాని మనసు కోసం....!!
దరి చేరని మమతల మాధుర్యంలో 
రాలిపోతున్న రవ్వల చక్రం...!!
గువ్వల గూడు చిన్నబోయిన చోట
మౌనం మాటేసి కాపలా కాస్తోంది...!!
చీకటి పహరాలో వేకువ దారిలో
చెదరిన గవ్వలు చేరువగా వస్తాయని...!!
మాటల ముచ్చట్లు రాసులుగా పోసి
చుక్కల గుట్టలు దోసిలి పట్టి చూస్తూనే ఉంది..!!
వెన్నెల వాకిట్లో తొంగి చూస్తూ జారిపోయి
గుమ్మం చాటుగా దొంగలా గడప దాటింది...!!
ఎదురు చూపుల మదిలో మరో రోజు మొదలై
రేయి తెల్లవారింది...మలి ఝాము కోసం మరల చూస్తూ...!!

19, డిసెంబర్ 2013, గురువారం

మనసు కావ్యం ....!!

చెప్పని కధకు సాక్ష్యం ఎక్కడని వెదకను
మిగిలిపోయిన జ్ఞాపకాల నీడలను అడిగితే...!!

ఎలా చెప్పాలో తెలియక నన్ను చూస్తూ
మాటలు రాక మౌనంగానే ఉంటాయేమో నీలానే...!!

జారిపోతున్న పరదా చాటున ఓ ఛాయ
కనిపించి కనిపించక దాగుడుమూతలాట నాతో నువ్వేనేమో..!!

ఇలా వచ్చి అలా వెళ్ళే ఆ గాలి స్పర్శ
నీ తలపుల బంధనాల చిక్కుల్లో చుట్టినా ఆనందమే నాకు..!!

మనసు పరచి మమత పంచిన బంధం
చేరువ కాలేక దూరం పోలేక నలిగి పోతున్న క్షణాలు మన మధ్య...!!

కన్నీటి కావ్యాన్ని చెరిపేసిన చెలిమి చెప్పకనే
చెంతనే ఉండి చేరువగా చేరితే ఆ సాన్నిహిత్యం అందమైన ప్రేమ కవనమే....!!

16, డిసెంబర్ 2013, సోమవారం

మరుగేలరా......!!

కలల అలల కావ్యమై విరిసి మురిసి
ముగ్ధ మోహనమై మువ్వలా ముడుచుకుని
సడి లేని సవ్వడిలా మదిలో సందడి చేస్తూ
నాలో చేరిన ఈ చైతన్యం ఎక్కడిది...!!

అహాల అడ్డు గోడల నడుమ నలిగి 
మనసుల మమతలు మరుగున పడినా
అంతస్థుల అహంకారాల మధ్య చిక్కుకున్నా
నా అస్థిత్వపు అలంకారం ఇక్కడే ఉంది....!!

ఎదురెదురు దిక్కుల్లా ప్రతి క్షణం చూసుకుంటూ
కలవని నింగినేలా కనికట్టులా కనిపిస్తూ
పరుగులు పెట్టే ఎండమావుల వెర్రి ప్రయాణం
సేద దీర్చే మలయమారుత సమీరాల కోసం....!!

నీకు అక్కర్లేక వదిలేసిన జ్ఞాపకం
మరచిన మరపు వాకిటిలో ఎదురు చూస్తోంది
జార విడిచిన గురుతులను భద్రంగా ఏరుకుంటూ
ఓ జీవిత కాలం పదిలంగా దాచుకుంటూ....!!

14, డిసెంబర్ 2013, శనివారం

మీ దృష్టిలో మనిషి విలువ....!!

ఏటో ఎర్ర బస్సెక్కి ఎలిపొచ్చిసినానని నానంటే అందరికి ఎగతాలై పోనాది...ఏదో మా ఊర్లొ ఉన్న బస్సెక్కిసినాను కాని నాకేటి తెల్దా ఏటి నానెక్కడికెల్లాలో...ఏ  బస్సెక్కాలో..!! ఏడిపించినా... ఎకసెక్కాలాడినా..నానూరికే భయపడిపోయి మా ఊరికి ఎలిపోతానేటి...?? నాకేటి కావాలో అది తీసుకునే పోతాను...భయపడి ఒట్టి సేతుల్తో ఉపేసుకుంటూ తల వొంచేసుకుని ఎలిపోను...ఏటో ఎర్ర బస్సు ఎక్కోచ్చేసినాది ఇదేటి సేత్తదిలే మహా మహా పోటుగాళ్ళే పారిపోనారు ఇదెంత అనుకుంటే అది నా తప్పు కాదు....భాష రాక పోయినా, యాస బాలేక పోయినా, పద్దతి తెలిస్తే సాలదేటి..?? నాను ఇలాగే ఉంటాను... నాలానే ఉంటాను....!!
ఈ మనసు మాటల్లో ఎంత నిజాయితీ ఉంది.. దానిలోనే ఎంత నిక్కచ్చితనము కనపడుతోంది...!! దేనికి భయపడని పోరాట పఠిమ తను అనుకున్నది సాధించడానికి...!! ఓ మారుమూల పల్లె మనసు అందరు గుర్తించే విధంగా ఎదగడానికి ఈ ఆవేశం చాలదూ..!!
ఈ పద్దతి, కల్మషంలేని మాటలతోనే అందరి మనసులు గెలుచుకోవచ్చని మనలో ఎంత మందికి తెలుసు...!! పల్లెటూరి వాళ్ళు మట్టి ముద్దలు, పట్టణపు పాలరాతి శిల్పాలతో పోటి పడలేరు అనుకుంటే అది మన పొరపాటే అవుతుంది...నాగరికతకు సరైన అర్ధం తెలుసుకుంటే మనం ఎక్కడ ఉన్నామో..ఎలా బతుకుతున్నామో తెలుసుకోగలం...!! ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళందరూ మేధావులు కాదు...రాని వాళ్ళందరూ చవటలు కాదు...భాష రావడం అవసరమే కాని అది ఎదుటి వారిని కించపరచడానికి కాదు...మన సంబంధ భాంధవ్యాలను పెంచుకోవడానికి...బాగా గొప్ప గొప్ప చదువులు చదువుకున్న విజ్ఞులు ఎందరో తమ చదువుని, తమ హోదాని కూడా మరిచి పోయి తమ కింది ఉద్యోగులను, తోటి వారిని చాలా హేళనగా మాట్లాడటం ఎంత అవమానకరం..!! డబ్బు, హోదా, పరపతి ఒకదానితో ఒకటి పోటి పడుతూ ఉంటాయి...వాటితో పాటు తమ హోదాను నిలుపుకోవాలన్న కాంక్ష కూడా అంతే బలంగా పోటి పడుతూ...ఎక్కడ తన  లోపాలు ఇతరులకు తెలిసి పోతాయో అని భయంతో ఎదుటి వారిని తక్కువచేసి మాట్లాడటం, నలుగురిలో కించపరచడం.. ఇలాంటివి చేస్తూ మనని మనమే బయట పెట్టేసుకుంటాం...!! ఒక మనిషికి ఆ మనిషిలోని విజ్ఞతకు, వ్యక్తిత్వానికి,మంచి మనసుకు విలువ ఇవ్వండి...డబ్బుకు, హోదాకు,భాషకు కాదు....!!

13, డిసెంబర్ 2013, శుక్రవారం

మనని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే...!!

ఏంటో....ఈ ప్రపంచంలో మనం ఒక్కరమే బాగా ఖాళి లేకుండా ఉన్నాము మిగిలిన అందరు పని పాటు లేకుండా ఊరికినే ఉంటున్నారు అనేసుకుంటూ ఉంటాము...మన గురించి మనకంత గొప్ప నమ్మకం కాబోలు మరి...!! మనకి ఎప్పుడో ఒకసారి ఎవరొ ఒకరు గుర్తు వచ్చి మన పలకరింపే ఆ గుర్తు వచ్చిన వారి జన్మ ధన్యం అనుకుంటూ మనకి వెంటనే సమాధానం చెప్పేయాలనుకోవడం...!! సమాధానాలు కాసేపు ఆలస్యం అయితే పదే పదే విసిగించడం..!! మనకు పనులు ఉన్నట్టే ఎదుటి వారికి కూడా ఉంటాయి అని ఆలోచించలేము ఎందుకో మరి...!!
ఒకప్పుడు కలం స్నేహం అంటే ఓ చక్కని అనుభూతి ఉండేది దానిలో... భావాలను పంచుకుంటూ...ఇప్పటి ముఖ పుస్తక స్నేహాలు, పోకళ్ళు ( అన్యధా భావించకండి అందరు కాదండి కొందరు మాత్రమే) చూస్తుంటే ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి...!! మన ఇంట్లో అన్ని ఉన్నా మళ్ళి దేనికోసమో పాకులాటలు...వెధవ నటనలు, జాలి మాటలు, పొగడ్తలు...ఇలా వీటిలో దేనికో ఒకదానికి మోసపోయి వాళ్ళ ఉచ్చులో పడక పోతారా అని ఎదురు చూస్తూ ఉంటారు...వ్యక్తిత్వం అనేది అందరికి ఉంటుంది...అది మన ఒక్కరి సొత్తేం కాదు...!! మన కున్న అనాగరికమైన ఆలోచనలు ఎదుటి వారికి ఉంటాయనుకోవడం మన భ్రమ..!! ఇష్టాలు, అభిప్రాయాలు, మనస్తత్వాలు...ఇలా కొన్ని కొందరిలో నచ్చుతాయి...కొన్ని నచ్చవు..ఇది ప్రతి ఒక్కరిలో ఉంటుంది....మనకు నచ్చని వారందరూ చెడ్డవారు కాదు.. అలా అని మనకు నచ్చిన వారందరూ మంచివారు అని చెప్పలేము...కొందరు మన దగ్గర మంచి వారిగా నటించవచ్చు...మన వేమన గారు ఎప్పుడోనే చెప్పినట్టు మేడి పండు చూడ మేలిమై ఉండు...పొట్ట విప్పి చూడ పురుగులుండు....ఎంత నిజం ఇది...!! మనిషిని చూడగలం కాని లోపలి మనసుని చూడలేము కదా....!! చూసే సరికే చాలా  జరగాల్సిన నష్టం జరిగి పోతుంది...అందుకే నొప్పింపక తానొవ్వక అన్నట్టు ఉంటూ మన పని మనం చేసుకుంటూ పోతుంటే సరి.... భావాలను పంచుకోండి...బందాలను పెంచుకోండి... భాద్యతలను మరువకండి...వయసును దానికి ఉన్న విజ్ఞాతా విలువలను అవహేళన కాకుండా చూడండి....మన కోసం మరొకటి జీవితాన్ని, ఆలోచనలను నాశనం చేయాలన్న ఆలోచనలను వదిలేస్తూ....ఎవరి కోసమో కాకుండా మన కోసం మనకంటూ కాస్త సమయాన్ని పంచుకుంటూ...మనని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే...!!

12, డిసెంబర్ 2013, గురువారం

ఏ తావుల సేరిందో..!!

సెలఏటి పాట వినిపించినాది
నెలవంక నీడ అగుపించినాది
మాటేసిన మబ్బులు దాచేసినాయి
సీకట్ల పరదాలు చుట్టేసినాయి
రాదారులన్ని బోసి పోయినాయి
సిరునవ్వుల ఎలుగులేక చింత పడే మనసుతో
గుండె గూడు గుబులై చిన్న బోయినాది
సుక్కల సీరల్లో దాగినాదేమో
మబ్బుల పానుపుల్లో పరున్నదేమో
కలై తోడుగా కడవరకు నడిచింది
మాటగా మదిలో సడి లేకుండా దాగుంది
గురుతులిడిసి పోనాది గుప్పిలి నిండుగా
తెరచిన సేతుల్లో జ్ఞాపకమై మిగిలింది
ఎటెల్లిపోనాదో ఏ తావుల సేరిందో..!!
యాడని ఎతికేది...ఎతికి ఎతికి ఏసారిన ఈ తనువు...!!

11, డిసెంబర్ 2013, బుధవారం

సేద దీరినవెందుకో...!!

మనసు మౌన కావ్యమైన తరుణాన
చెప్పలేని బతుకు అర్ధాలు మూగబోతే
పలుకలేని భావాలను తెలుపలేక
చిన్న బోయిన మోము...చాటున దాగుంది...!!

కలలకర్ధం కంటికి తెలిసినా తెలుపలేని భాష
కన్నీటికి దొరికినా ఆ భావనల ఒరవడిని
తట్టుకునే తనువు తనదైనా తనది కాని
మదిని సముదాయించలేని వృధా ప్రయత్నం ఇది ...!!

పొదరింటి పయనం పొడ గిట్టని ప్రయాణమై
మాటల శరాలు శతఘ్నులై పహారా కాస్తుంటే
జ్వాలలై ఎగసి పడుతున్న అంతరాగ్ని కాల్చేస్తోంది
తనువును సమిధలు లేకుండానే...!!

అందుకోలేని అగ్ని పుష్పమై అలరాలినా
అందని అంబరమై ఆశలు రేపెట్టినా
అలరులు కురిసిన ఆనందానికి ఆలవాలమైనా
అశ్రు ధారలు ఆ నయన తారకల చెంతన సేద దీరినవెందుకో...!!

10, డిసెంబర్ 2013, మంగళవారం

ఎదురు చూపులే చివరికి....!!

మాయని మమతల మాటున దాగిన
మౌన హృదయం గాయపడి బేలగా
రోదిస్తోంది  నీ నిర్లక్ష్యానికి చిరునామాగా...!!

పొంగిన ప్రేమ వెల్లువలో మునిగిన మనసు
ఊపిరందక ఉక్కిరి బిక్కిరై కొట్టుకుపోతూ
నీ ఆసరా కోసం ఆశగా చూస్తూనే ఉంది....!!

కాలాలు గడచినా యుగాలు మారినా
మారని తన తలరాతను నిందించుకుంటూ
రాని నీ కోసం ఎదురు చూస్తూనే ఉంది....!!

నీ సహవాసాన్ని గుర్తు చేసుకుంటూ
నీ జ్ఞాపకాల సాహచర్యంలో బతికేస్తూ
నీ గురుతులతో స్నేహం చేస్తూనే ఉంది అనుక్షణం...!!

ఓ జీవిత కాలాన్ని వెచ్చించి
మరో కొత్త జీవితానికి నాందిగా
నీతో పయనమైతే మధ్యలోనే విసిరి వేసిన ఈ బంధానికి...
ఎదురు చూపుల నిరాశలే చివరికి....!!

9, డిసెంబర్ 2013, సోమవారం

ఆత్మీయతకు మారు పేరుగా...!!

ఏ పరిచయం ఎటు పోతుందో....!!
ఏ  స్నేహం ఏ దారంట వెళుతుందో...!!
తెలియని మలుపుల సుడిలో కొట్టుకు పోతాయో...!!
ఎవరి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయో తెలియక....ఎందుకొచ్చిన మనకు తెలియని పరిచయాలు పెంచుకోవడం...!! ఎవరి మనసులో ఏముందో ఆ పరమాత్ముడి కెరుక...మర్యాద మన్నన అనేవి ఇచ్చి పుచ్చుకునే ఆభరణాలు ఏ సంస్కృతిలోనైనా...!! మనసులో తప్పుడు ఆలోచనలు మనిషిని కలుషితం చేస్తాయి...మనకు ఉన్న ఆలోచనలే ఎదుటి వారికి ఉంటాయనుకోవడం చాలా తప్పు..ఎదుటి వారిని బట్టి మన మాటలు చేతలు ఉండాలి  కాని మనకు నచ్చినట్టు మాట్లాడేసి హమ్మయ్య మన పని అయిపొయింది అనుకోకూడదు...మనని మనం మోసం చేసుకున్నా క్షమించవచ్చు కాని...ఎదుటి వారిని మోసం చేయడం చాలా తప్పు...మీరు అనవచ్చు మోసపోతేనే కదా మోసం చేయగలిగేది అని.. మనం చేసేది మోసం కాదు వారిలోని నమ్మకాన్ని మోసం చేస్తున్నాం అని...!! అన్ని ఉన్నా ఇంకా దేనికోసమో వెంపర్లాట..దానికోసం సవాలక్ష అబద్దాలు...!! ప్రేమంటూ ఒకరు..ఇష్టమంటూ ఒకరు ఇలా చెప్పుకుంటూ పొతే బోలెడు భిన్న మనస్తత్వాలు...వ్యక్తిని, విజ్ఞతను అభిమానించండి తప్పులేదు అంతే కాని ఎదుటి వారి మనసుతో కాని, జీవితంతో కాని ఆడుకోకండి...మన పరిధి ఎక్కడో అక్కడే ఉంటే అందరికి ఆనందదాయకం..!! ఎవరి ఇష్టం వారిది అంతే కాని మన ఇష్టాలను బలవంతంగా వాళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నం చేయవద్దు...
దానివల్ల దూరం పెరిగి ఈ దారపు బంధాలు పుటుక్కున తెగిపోయే ప్రమాదమే ఎక్కువగా ఉంది...!! ఏ పరిచయమైనా అందరికి సంతోషంగా ఆమోదయోగ్యంగా ఉండాలి కాని...హేళన చేయించుకునేదిగా ఉంటూ అపహాస్యం పాలు కాకూడదు...మన వయసుకు తగినట్టు హుందాగా...సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలుగా చక్కని నడవడితో...ప్రవర్తన అందరికి మంచిది...!! అది పది కాలాలు పదిలంగా అందరి హృదయాల్లో నిలిచి పోతుంది.. ఆత్మీయతకు మారు పేరుగా...!!

8, డిసెంబర్ 2013, ఆదివారం

మనకి మనమే మిగిలేది....!!

నేను ముసుగు వేసుకున్నా
నా అంతరంగానికి తెలియకుండా...
ఎవరికీ కనిపించలేదేమో అనుకుంటూ
పారిపోవాలని పరుగెడుతూనే ఉన్నా...
అలసి పోయి ఎప్పటికో ఆగిపొయాను
వేసుకున్న ముసుగు తొలగి వెలుగు గుచ్చుకుంది
చూడలేక అడ్డుగా చేతులు పెట్టుకున్నా
నేనెక్కడ ఉన్నానో తెలియక....
నాకు తెలియకుండానే
దిగంతాల అంచులకి చేరుకున్నా అప్పటికే... 
నా చుట్టూ శున్యమే తోడుగా ఉంది
ఒంటరి పయనంలో మనసుకు కప్పిన దుప్పటి
చిరిగి పోయింది...అ చిరుగులకు అర్ధం
వీడిన చీకట్లు విన్నవించాయి....
బంధాలు...భాద్యతలు...ప్రేమలు..అభిమానాలు
అన్ని జగన్నాటకంలో మొహాలు...
ఈ బతుకు పయనంలో...
మన రాక ఒంటరే..పోక ఒంటరే..
చివరికి మనకి మనమే మిగిలేది....!!

4, డిసెంబర్ 2013, బుధవారం

మరుజన్మకు చేరువగా...!!

చేజారిన వలపు చెలిమిని 
వదలలేని మనసు తపన
ఊపిరికందని శ్వాసలో చేరి
శిలగా మిగిలిన నా మదిలో
చెరగని చెదరని సజీవ జ్ఞాపకానివై
నిలిచిన నీ కోసం మిగిలున్నా...!!

నీతో పంచుకున్న స్నేహ పారిజాతాలు
ఇంకా గుభాళిస్తూనే ఉన్నాయి నా చుట్టూ
దూరమైన నీ సాంగత్యం మరువలేకున్నా
చేరువ కాని నీతోనే ఉండాలనుకుంటున్నా
నిరంతరం నీతోనే నా పయనం సాగనీ
ఇలా మరుజన్మకు చేరువగా...!!

2, డిసెంబర్ 2013, సోమవారం

ద్వితీయ బహుమతి....!!


మన తెలుగు మన సంస్కృతి's photo.మన తెలుగు మన సంస్కృతి చిత్ర కవిత -11 పోటీ విజేతలు
న్యాయ నిర్ణేత: అర్ వి ఎస్ ఎస్ శ్రీనివాస్ గారు

న్యాయ నిర్ణేత మాటలు:

హిమాలయాల అందాలు వర్ణించిన ఈ కవిత
ద్వితీయ బహుమతికి అర్హమైనదిగా నిలిచింది.
కవితలో అంత్యప్రాస వాడిన విధానం చదువరులను ఆకట్టుకుంటుంది.
హిమాలయాలను వర్ణించే సొగసైన పదాలు వాటితో బాటు ఆధ్యాత్మికతను
ఆఖర్లో చేర్చి మన సంస్కృతికి కూడా మూలమని చెప్పారు.
భాష మీద పట్టు కనబడుతోంది.
రచయిత /రచయిత్రి కి అభినందనలు.

ద్వితీయ బహుమతి పొందిన కవిత.

హిమ వర్ణాలు మంచు పూల పానుపులు
హిమపాతాల సొగసుల సౌందర్యాల గనులు
తాకే మలయ సమీరాలు మధుర సంతకాలు
వణికించినా వాడని వీడని విడదీయలేని బంధాలు
ఆకాశ హార్మ్యాలు అందమైన అందాలు ఈ ధవళ సానువులు
నీలి గగనాన శ్వేత పానుపుల పాలపుంతలు
వెండి మెరుపుల కాంతుల కమనీయ కావ్యాలు
ప్రాచీన సంస్కృతీ ఆధ్యాత్మికతల ఆలవాలం
పరమేశ్వరుని భూకైలాస గిరుల సిరులు
అంబరాన్నంటే ఆనంద తాండవ స్వరూపం
హిమగిరుల హొయల నుడికారం నయనానందకరం..!!

నీ రాకతో....!!

స్వరాల జతలు జత కలువలేదు
పద లయల సవ్వడులు వినిపించలేదు
ఎక్కడో జారిపోయిన మువ్వల మాటలు
హంసధ్వనిలా అనిపించాయేమో....!!

స్వర రాగాలు సప్త స్వర నాదాలుగా
వినిపించిన మనో వీచిక అల్లరి
చక్రవాకాల గమకాల శృతిలో
ఇంకా నను తాకుతూనే ఉన్నట్టుంది...!!

ఆరోహణావరోహణాల మధ్యమంలో
గాంధారంలా గంభీరంగా అనిపించినా
హిందోళంలో హిమపాతాల చల్లదనం
ఆనందభైరవి అంచులను అందుకున్న ఆనందమో...!!

సావేరి జతుల గతుల అరుణోదయం
వర్ణ రాగాల వక్ర రాగాల విషాదాంత్య రాగాల
విరచిత కవనం ఈ జీవిత రాగం మేళవించిన
మోహన రాగం నీ పరిచయ స్నేహ రాగం...!!

సప్త వర్ణాల సప్త స్వరాల ఆటల అలల
ఊహల కలల రేఖా చిత్రం నా మనో గవాక్షాన
అంబరాన్ని కాన్వాసుగా మేఘాల రంగుల్లో
మెరిసిన అలజడి మేఘన రాగమైనదేమో...నీ రాకతో....!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner