9, అక్టోబర్ 2014, గురువారం

అంతిమ విజయ సోపానం....!!

నా సమాధి మాట్లాడుతోంది వినిపిస్తోందా...
నిద్రాణమైన మనసు నిదుర పోతూనే ఉంది
మెలకువలో అబద్దపు నిష్టూరాలను తట్టుకోలేక  
అలసిన శరీరానికి ఆలంబన దొరకలేదని
తపన పడిన రోదన స్వరం ఆర్తిగా పిలుస్తున్నా...
వినిపించని దూర తీరాలలో దాగిపోయిన
దాతృత్వం కన్నీటిలో కరుగుతున్న కాలాన్ని
వెనుకకు తిప్పలేని నిస్సహాయత వెక్కిరిస్తూ...
ఆశల వలయాల శృంఖలాలను ఛేదించలేని
బంధనాలుగా బంధాలను వాస్తవంగా బంధిస్తే...
కరిగి పోతున్న జీవితంలో 'ని'వేదన మరచి
వేదన వరదలో మునుగుతున్న రాతిముక్క
ఆక్రోశం సూది మొనగా మారి శరమై శిఖరమై
అణచివేతకు ధీటుగా నిలబడాలన్న ఆ చిత్తం
పెనుగులాటల్లో పలుకుతున్న శిలా శాసనాలు
జీవ సమాదుల్లోని సజీవ ఘట్టాలుగా నిలుస్తూ
నినదిస్తున్న ఈ చిర పరిచిత స్వరాల ఘోషల
పోరాటమే అంతిమ విజయ సోపానం....!!

నేనుగా మిగిలి పోవాలని.....!!

 నాకేమీ కాని నీకు....
నాకు అర్ధం కాని మాటల పదాలు నీకెలా తెలుసా అని బోలెడు ఆశ్చర్యంగా ఉంది... అస్సలు మాటలే వద్దు అనుకున్నా మాటాడక తప్పని జీవితాలై పోయాయి... మరచి పోయిన బోలెడు అక్షరాలు ఇక్కడ ప్రత్యక్షమై పోతున్నాయి ఎందుకో... విలువలు తెలియని బతుకుని విలువగా చూడటానికి పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరుగా జారి పోయింది అని మధన పడే ఒపికే లేకుండా పోయింది... ముక్కలైన మనసుకి ఎన్నిసార్లు అతుకులు వేద్దామని ప్రయత్నం చేసినా అది అతుకులు పడక విడి పోతూనే ఉంది... సర్దుకు పోవడానికి చేసే ప్రతి ప్రయత్నాన్ని చేతగానితనంలా నువ్వు అనుకుంటూ... కారుతున్న ప్రతి కన్నీటి చుక్కకి సమాధానం చెప్పే రోజు కోసం ఎదురు చూసే సహనాన్ని కూడా చంపేసిన నీ అహం... నువ్వు ఇచ్చిందే నీకు తిరిగి ఇవ్వాలని చూస్తుంటే ఎందుకు ఒప్పుకోలేక పోతున్నావు..?? ఎప్పుడైనా మనం ఎదుటివారికి ఇచ్చేదే మనకి తిరిగి వస్తుంది అన్న చిన్న విషయం నీకు ఎందుకు గుర్తుకి రావడం లేదు... నమ్మిన పాపానికి పడిన ఈ మానసిక రోదనకు ఇంకా ఏం శిక్ష వేయాలని నీ కోరిక... కుటుంబం అంటే తెలియని వాళ్ళకి ఈ అనుబంధాలు.. అభిమానాలు... ప్రేమల గురించి ఎంత చెప్పినా ఉపయోగం ఉండదని చాలా ఆలశ్యంగా తెలిసింది.. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పోయింది... పెళ్ళాం, పిల్లలు మన హోదా కోసం కాదు... మన కోసం అని నీకు తెలిసే సమయం ఈ జన్మకు లేదని...
మొన్నీమద్యన జరిగిన దారుణం బాగా చదువుకున్న ప్రొపెసర్ తమ మధ్యన జరిగిన గొడవలకు కన్నబిడ్డలను చంపి తను ఆత్మహత్య చేసుకున్న వార్త విన్న రోజు ఆ ప్రోపెసర్ని తప్పు పట్టాను... చస్తే వాడు చావచ్చు కదా... పిల్లల్ని పొట్టన పెట్టుకున్నాడు.. ఏం హక్కు ఉంది అని... నీ పలాయన వాదాలు విని విని నాకు అనిపిస్తోంది అలా చేయడానికి ఆ తండ్రి మనసు  ఎంత క్షోభ పడిందో ఇప్పుడు తెలుస్తోంది.... మనం తప్పులు చేస్తూ గొంతు ఉంది కదా అని అరిస్తే తప్పు ఒప్పు అయిపోదు కదా.... నేనుగా బతకాలి అన్న ఆశను సమాధి చేసిన నీకు... నీతో సహకరించిన సమూహానికి... మీ అందరి చేతిలో మోసపోయిన మా బతుకుల చితిని కానుకగా సమర్పించి కనీసం ఆత్మగా మిగిలి పోవాలని కోరుకోవడం కూడా ఆ దేవునికి అత్యాశగా అనిపించి మృత్యువుని దగ్గర చేసినట్టే చేసి దూరం చేస్తూ ఆడుకుంటున్నాడు నీలానే....!!
నేనుగా మిగిలి పోవాలని.....

7, అక్టోబర్ 2014, మంగళవారం

నా కోసమే కాబోలు...!!

శాపగ్రస్థగా మారిన నా మనసు
చిలికిన హలాహలాన్ని దాచిన
వెన్నెల పరదాలు తూట్లు పడి
ఒలికించిన రుధిర వర్షపు ధారలలో
తడిసిన తనువు మరణించినా
తడి ఆరని గురుతుల కొవ్వొత్తుల
తరుగుతున్న రూపానికి సాక్ష్యంగా
వెలుగుతున్న కాంతుల వెలుతురులో
కారుతున్న కన్నీటికి తడిచిన కంటికి
చెమ్మను అద్దిన చెంపకు తెలిసిన
చెలిమి సంగతికి గడిచిన గతానికి
జరుగుతున్న వాస్తవానికి మధ్యన
ఇంకా జ్ఞాపకాలు మిగిలే ఉన్నాయి
నా కోసమే కాబోలు...!!

తెలుగు సాహితీ ముచ్చట్లు ...రెండవ భాగం....!!

 సభ్యులందరికీ........విజయదశమి శుభాకాంక్షలు.......
ఎన్నో అద్భుతాలు చోటు చోటు చేసుకున్న మన తెలుగు సాహిత్యానికి ముందుగా అమ్మ పాడిన లాలిపాటలు మధురమైనవి.... అన్నమయ్య పదాలు... జాణ పదాల జావళి పాటలు... ఇలా చెప్పుకుంటూ పొతే బోలెడు .... ఇక సాహితీ ముచ్చట్లలో ముచ్చటైనవి గురు లఘువుల గమ్మత్తులతో మనలను అలరాలించిన అందమైన వృత్తాల ఛందస్సుతో కూడిన పద్య రాజాలు ఇప్పటి రోజులలో తెలిసిన వారిని వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చును.....అర్దాల ప్రతిపదార్దాలు  పదాల వ్యతిరేక పదాల నొక్కులతో ప్రకృతి వికృతుల కలయిక గ్రాంధికాల గమ్మత్తులతో అందమైన తెలుగు సొగసులు ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూనే ఉంటాయి... అందమైన అలంకారాలు తెలుగు సొగసుకు మరింత శోభను చేకుర్చగా.... 

అతివకు నగలు సౌందర్యము కలిగించును. అలాగే కావ్యములకు ఈ అలంకారములు సౌందర్యమును కలిగించును. అలంకారములు రెండు రకములు. అవి:

శబ్దాలంకారములు

శబ్దమాత్ర ప్రధానములయినవి శబ్దాలంకారములు.
  • వృత్త్యానుప్రాసాలంకారము : ఒక హల్లు అనేక పర్యాయములు వచ్చునట్లు చెప్పబడినది. ఉదాహరణ: చొక్క పుటుక్కు క్రిక్కిరిసి స్రుక్కక పెక్కువ నక్క జంబుగన్. మరొక్క ఉదాహరణ పద్యంలో. గడన గల మగని జూసిన, అడుగడుగున మడుగులిడుదురు అతివలు తమలో, గడనుడిగిన మగని జూసిన నడుపీనుగ వచ్చె ననుచు నగుదురు సిమతీ. ఈ పద్యంలో అనే అక్షరము పలుమార్లు వచ్చి శబ్దాలంకారాన్ని చేకూర్చింది. అలాగే వచనములో కూడ శబ్ధాలంకరమునకు మరొక ఉదాహరణ: (అల్లసాని పెద్దనగారి మనుచరిత్రము లో) అనినన్ జిటిలుండు పటపటమని బండ్లు గొరికి, యటమటంమ్మున విద్య గొనుటయుంగాక గుట గుటలు గురుతోనా యని ..... ఇందులో ట అను అక్షరము పలుమార్లు వచ్చినది.
  • ఛేకానుప్రాసాలంకారము : అర్థ భేదము గల రెండేసి అక్షరములు వ్యవధానము లేకుండా వెనువెంటనే వచ్చుట. ఉదాహరణ: భీకర కర వికరముల్.
  • లాటానుప్రాసాలంకారము : అర్థభేధము లేక తాత్పర్య భేధము కలుగునట్లు ఒక పదము రెండు సార్లు ప్రయోగింపబడిన అది లాటానుప్రాసము. ఉదాహరణ: శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ.
  • యమకాలంకారము : అర్థభేదముగల అక్షరముల సమూహమును మరల మరల ప్రయోగింపబడినచో దానిని యమకము అందురు. ఉదాహరణ: పురమునందు నందిపురమునందు.
  • ముక్తపదగ్రస్తాలంకారము : విడిచిన పద భాగము అవ్యవధానముగా మరల గ్రహించుచు వ్రాయబడిన అది ముక్తపదగ్రస్తము. ఉదాహరణ: ఓ రాజా! శత్రువులను జయించుము, జయించి రాజ్యమును పొందువు. పొంది ప్రజలను పాలింపుము. పాలించి సుఖమును పొందుము.
  • అంత్యప్రాసాలంకారము : మొదటి పాదం చివరి భాగంలో ఏ అక్షరంతో (అక్షరాలతో) ముగిసిందో, రెండో పాదం కూడా అదే అక్షరంతో (అక్షరాలతో) ముగుసినట్లైతే అది అంత్య ప్రాసం అవుతుంది. ఉదాహరణ: తోటలో నారాజు తొంగి చేసెను నాడు; నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు.

అర్థాలంకారములు

అర్థ విశేషములను బట్టి వచ్చునవి అర్థాలంకారములు.
  1. ఉపమాలంకారం: ఉపమానానికి, ఉపమేయానికి సామ్య రూపమైన సౌందర్యాన్ని సహృదయ రంజకంగా చెప్పడం ఉపమాలంకారం.
  2. అన్వయము
  3. ఉపమేయోపమ అలంకారం: రెండు వస్తువులకు పర్యాయ క్రమమున ఉపమేయ ఉపమానత్వమును కల్పించి చెప్పడం ఉపమేయోపమ అలంకారం.
  4. ప్రతీపాలంకారం : ఉపమానముగా ప్రసిద్ధమయిన దానిని, ఉపమేయంగా కల్పించి చెప్పడం ప్రతీపాలంకారం. అంటే ఉపమానం కావలసింది ఉపమేయంగా మారినందువల్ల రెండింటినీ ఉపమేయాలుగానే భావించవలసి వస్తుంది.
  5. రూపకాలంకారం : ఉపమేయమునందు ఉపమాన ధర్మాన్ని అరోపించడం రూపకాలంకారం. ఉపమేయమునకు ఉపమానం తోటి అభేదాన్ని గాని, తాద్రూప్యాన్ని గాని వర్ణించటం రూపకం. ఒకటి అభేద రూపకం, రెండవది తాద్రూప్య రూపకం.
  6. పరిణామము
  7. ఉల్లేఖాలంకారం : ఒక్క వస్తువే ఒక్కొక్కరికి ఒక్కొక్కటిగా కనిపించడం ఉల్లేఖాలంకారం.
  8. స్మృతి
  9. భ్రాంతి మదలంకారం : ఒక దానిని చూచి మరొకటిగా భ్రమించినచో అది భ్రాంతిమత్ అలంకారం
  10. సందేహాలంకారం : సందేహం (అనిశ్చయ జ్ఞానం) వలన ఏర్పడే అలంకారం సందేహాలంకారం.
  11. అపహ్నుతి
  12. ఉత్ప్రేక్షాలంకారము : ఉపమానమునందున్న ధర్మాలు ఉపమేయమునందు కూడా ఉండటం వలన ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం ఉత్ప్రేక్షాలంకారం.
  13. అతిశయోక్త్యలంకారము : చెప్పవలసిన దానిని ఎక్కువ చేసి చెప్పడం, గొప్పగా చెప్పడం అతిశయోక్తి అలంకారం.
  14. తుల్యయోగిత
  15. దీపకాలంకారం : ప్రకృతాప్రకృతములకు ధర్మైక్యం చేసి చెప్పడం దీపకాలంకారం.
  16. ఆవృత్తిదీపకము
  17. ప్రతివస్తూపమాలంకారం : రెండు వాక్యముల కొక సామాన్య ధర్మముతో అన్వయం ఉంటే అది ప్రతి వస్తూపమాలంకారం. అంటే ప్రతి వాక్యార్ధంలోనూ ఒకే సమాన ధర్మాలను భిన్న పదాలచేత తెలియజేయడం.
  18. దృష్టాంతాలంకారము : రెండు వాక్యాల యొక్క వేరువేరు ధర్మాలు బింబ ప్రతిబింబ భావంతో చెబితూ ఉంటే అది దృష్టాంతాలంకారం.
  19. నిదర్శన
  20. వ్యతిరేకాలంకారం : ఉపమేయ ఉపమానములకు పోలికతో పాటు భేదమును కూడా చెప్పినచో అది వ్యతిరేకాలంకారం.
  21. సహోక్తి
  22. వినోక్తి
  23. సమాసోక్తి
  24. పరికరాలంకారం : సాభిప్రాయ విశేషణాలతో కూడినచో అది పరికరాలంకారం.
  25. పరికరాంకురము
  26. శ్లేషాలంకారము : అనేకార్థాల నాశ్రయించుకొని యుండిన ఎడల అది శ్లేషాలంకారం.
  27. అప్రస్తుత ప్రశంసాలంకారం : ప్రస్తుతమును ఆశ్రయించుకొని, అప్రస్తుతమును తలచుకొన్నచో అది అప్రస్తుత ప్రశంసాలంకారం.
  28. ప్రస్తుతాంకురము
  29. పర్యాయోక్తము
  30. వ్యాజస్తుతి అలంకారం : పైకి నిందిస్తున్నట్లుగా కనిపించినా తరచిచూస్తే స్తుతి చేస్తున్న విధం కనిపిస్తుంది. పైకి స్తుతిస్తున్నా తరచిచుస్తే నిందిస్తున్నట్లు కనిపిస్తుంటే వ్యాజస్తుతి అలంకారం.
  31. వ్యాజనిందాలంకారం : నింద చేత మరియొక నింద స్ఫురించటం వ్యాజనిందాలంకారం.
  32. ఆక్షేపము
  33. విరోధాభాసాలంకారం : విరోధమునకు అభాసత్వము కలుగుచుండగా విరోధాభాసం అవుతుంది. పైకి కనిపించే విరోధం విరోధంగా కాకుండా విరోధం ఉన్నట్లుగా అనిపించి, ఆలోచిస్తే ఆ విరోధం అభాసం (పోతుంది) అవుతుంది. కనుక ఇది విరోధాభాసాలంకారం.
  34. విభావన
  35. విశేషోక్తి అలంకారం : సమృద్ధంగా కారణం ఉండి కూడా కార్యోత్పత్తి జరగక పోవడం విశేషోక్తి అలంకారం.
  36. అసంభవము
  37. అసంగతి
  38. విషమాలంకారం : అనను రూపాలయిన (సమాలు కాని) రెండింటికి సంబంధం వర్ణింపబడిన ఎడల అది విషమాలంకారం.
  39. సమము
  40. చిత్రము
  41. అధికము
  42. అల్పము
  43. అన్యోన్యము
  44. విశేషము
  45. వ్యాఘాతము
  46. కారణమాల
  47. ఏకావలి
  48. మాలాదీపకము
  49. సారాలంకారం : పూర్వపూర్వముల కంటె ఉత్తరోత్తరాలకు ఉత్కర్ష కలిగించడం సారాలంకారం. ముందున్న వాటి కంటె తర్వాత వచ్చేవాటికి గొప్పతనాన్ని కలిగించడం ఉత్తరోత్తర ఉత్కర్ష అంటారు.
  50. యథాసంఖ్య అలంకారం : ఒక దాని తరువాత ఒకటిగా వరుసగా సమాన సంఖ్యాకాలయ్యే వాటి యొక్క సముదాయం యథాసంఖ్య లేదా క్రమ అలంకారం.
  51. పర్యాయము
  52. పరివృత్తి
  53. పరిసంఖ్య
  54. వికల్పము
  55. సముచ్చయము
  56. కారకదీపకము
  57. సమాధి
  58. ప్రత్యనీకము
  59. కావ్యార్థాపత్తి
  60. కావ్యలింగాలంకారం : సమర్థనీయమయిన అర్థానికి సమర్థనం కావ్యలింగాలంకారం.
  61. అర్థాంతరన్యాసాలంకారం : సామాన్యం చేత విశేషం గాని, విశేషం చేత సామాన్యం గాని సమర్థింప బడితే అది అర్థాంతరన్యాసాలంకారం.
  62. వికస్వరము
  63. ప్రౌడోక్తి
  64. సంభావన
  65. మిథ్యాధ్యవసితి
  66. లలితము
  67. ప్రహర్షణము
  68. విషాదము
  69. ఉల్లాసము
  70. అవజ్ఞ
  71. అనుజ్ఞ
  72. లేశము
  73. ముద్ర
  74. రత్నావళి
  75. తద్గుణాలంకారం : స్వీయ గుణాన్ని వదిలేసి మరొక దాని గుణాన్ని స్వీకరించటం వర్ణించినట్లయితే అది తద్గుణాలంకారం.
  76. పూర్వరూపము
  77. అతద్గుణము
  78. అనుగుణము
  79. మీలితము
  80. సామాన్యము
  81. ఉన్మీలితము
  82. విశేషము
  83. ఉత్తరము
  84. సూక్ష్మము
  85. పిహితము
  86. వ్యాజోక్తి
  87. గూడోక్తి
  88. వివృతోక్తి
  89. యుక్తి
  90. లోకోక్తి అలంకారం : సందర్భాన్ని అనుసరించి ఒక సామెత లేదా నానుడి చెప్పడం లోకోక్తి అలంకారం.
  91. ఛేకోక్తి అలంకారం : లోకోక్తితో పాటు అర్థాంతర స్ఫురణం కూడా ఉండటం ఛేకోక్తి అలంకారం.
  92. వక్రోక్తి అలంకారం : శ్లేష వలన గాని, కాకువు వలన గాని అన్యార్ధం కల్పించబడిన అది వక్రోక్తి అలంకారం.
  93. స్వభావోక్తి అలంకారం : జాతి, గుణ, క్రియాదుల చేత దాని స్వభావాన్ని వర్ణించిన ఎడల అది స్వభావోక్తి అలంకారం.
  94. భావికము
  95. ఉదాత్తాలంకారం : సమృద్ధిని గాని, అన్యోపలక్షిత మయిన శ్లాఘ్య చరిత్రను గాని వర్ణించిన ఎడల అది ఉదాత్తాలంకారం అవుతుంది.
  96. అత్యుక్తి
  97. నిరుక్తి
  98. ప్రతిషేధము
  99. విధి
  100. హేతువు
కావ్యానికైనా, కవితకైనా, పాటకైనా, పద్యానికైనా అలంకారం అలంకారాలే. ఈ సొమ్ములతో గూడిన రచనలను స్రావ్యమైన గొంతుతో గానం చేసినప్పుడు వినే మనిషి తనకు తెలియకుండానే లీనమై పరవశించి పోతాడు. మనిషి పుట్టుకతో అలంకారాలు పుట్టినట్టు భాష పుట్టుకతో పాటే ఈ అలంకారాలు పుట్టాయేమో! నిజమైన ఆవేశంతో మాట్లాడే మనిషిని గమనించండి. అతని మాటల్లో ఎన్ని అలంకారాలు దొర్లుతాయో !. వ్యాకరణ శాస్త్రాలు పుట్టి అలంకారాన్ని రకరకాలు గా విభజించి అలంకార శాస్త్రానిగా ప్రాచుర్యం జరిపారు కానీ నిజానికి వ్యాకరణం వల్ల భాషకానీ అలంకారాలు కానీ పుట్టలేదు. బహుశా పద్యం పుట్టిందేమో !. ఏ వ్యాకరణం తెలియని పల్లె వాసీల భాషలో ఎన్నో అలంకారాలు అలవోకగా దొర్లుతుంటాయి.

ఇక మన వాఙ్మయ చరిత్ర చూసినట్లైతే భరతుడు నాట్యశాస్త్రాన్ని యమకమనే శబ్దాలంకారాన్ని, ఉపమ, దీపక, రూపక ములనెడి అర్థాలంకారాలను చెప్పాడని అంటారు. వివిధ వ్యాకరణ శాస్త్రవేత్తలు ఈ అలంకారాలను వివిధరకాలుగా విభజించినట్లు కనిపిస్తుంది.

దండి - 34 అలంకారాలని చెప్పాడు
మమ్మటుడు - 59 అలంకారాలు
విద్యానాథుడు - 66 అలంకారాలు
చన్ద్రాలోక కర్త - 101 అలంకారాలు
కువలయానందము ( అప్పయ్య దీక్షుతులు ) - 124 అలంకారాలు .....నాకు నాకు తెలిసిన నేను సేకరించిన అలంకారాల సమాచారాన్ని ఈ వారం అందించాను.... 

వివరణ తెలుగు   వికిపీడియా సౌజన్యంతో....
హృదయస్పందనల చిరుసవ్వడి సహకారంతో.....
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో..... .

తెలుగు సాహితీ ముచ్చట్లు ....మొదటి భాగం....!!

ఏ సాహిత్యానికైనా  మూలం భాష ... భాషకు పట్టుకొమ్మలు అక్షరాలు... ఆ క్రమలోనే మన తెలుగు అక్షరాలు ఇలా ఉన్నాయి... తెలుగు భాషకు అక్షరములు యాభై ఆరు. వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షరములు గా విభజిస్తారు. ఇరవై ఒకటవ శతాబ్దంలో బాగా వాడుకలో ఉన్నవి 12 అచ్చులు, 31 హల్లులు, నకార పొల్లు, నిండు సున్న, వెరసి 45 అక్షరములు. అరసున్న, విసర్గ వాడకం చాలవరకూ తగ్గిపోయింది. తెలుగు వర్ణ సముదాయమును మూడు విధాలుగా విభజించవచ్చును.
 అచ్చులుఅచ్చులు 16 అక్షరాలు. స్వతంత్రమైన ఉచ్చారణ కలిగియుండుట వలన వీటిని ప్రాణములనీ, స్వరములనీ కూడా అంటారు. అచ్చులు మూడు రకములు. అవి:
  • హ్రస్వములు - కేవలము ఒక మాత్ర అనగా రెప్పపాటు కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను హ్రస్వములు అంటారు. ఇవి ఏడు అక్షరములు: అ, ఇ, ఉ, ఋ, ఌ, ఎ, ఒ.
  • దీర్ఘములు - రెండు మాత్రల కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను దీర్ఘములు అంటారు. ఇవి తొమ్మిది అక్షరములు: ఆ, ఈ, ఊ, ౠ, ౡ, ఏ, ఓ.
  • ప్లుతములు - ఇవి ఉచ్ఛరించడానికి మూడు మాత్రల కాలం పట్టును. ఇవి రెండు అక్షరములు: ఐ, ఔ.
అచ్చులు






ఉభయాక్షరమలు


  అం    అః

హల్లులు

హల్లులు 37 అక్షరములు. క నుండి హ వరకు గల అక్షరములను హల్లులు అందురు. ఈ హల్లులు అచ్చుల సహాయము లేనిదే పలుకబడవు. ఉదాహరణ: క అనాలంటే క్ + అ కలిస్తేనే క అవుతుంది. వీటిని ప్రాణులనీ, వ్యంజనములనీ పేర్లు కలవు.
  • పరుషములు: పలుకడానికి కొంత శ్రమ అవుసరమైనవి. వీటికి "శ్వాసములు" అన్న పేరు కూడా ఉంది. "క,చ,ట,త,ప"లు పరుషములు.
  • సరళములు : తేలికగా పలికేవి. వీటికి "నాదములు" అన్న పేరు కూడా ఉంది. - "గ,జ,డ,ద,బ"లు సరళములు
  • సరళములు - హల్లులలో సులభముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - గ, జ, డ, ద, బ.
  • పరుషములు - హల్లులలో కఠినముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - క, చ, ట, త, ప.
  • స్థిరములు - పరుషములు, సరళములు కాక మిగిలిన హల్లులన్నియు స్థిరములు. ఇవి - ఖ, ఘ, ఙ, ఛ, ఝ, ఞ, ఠ, ఢ, ణ, థ, ధ, న, ఫ, భ, మ, య, ర, ఱ, ల, ళ, వ, శ, ష, స, హ, క్ష.
  • స్పర్శములు - ఇవి క నుండి మ వరకు గల అక్షరములు. ఇవి ఐదు వర్గములుగా విభజింపబడినవి.
    • క వర్గము - క, ఖ, గ, ఘ, ఙ
    • చ వర్గము - చ, ఛ, జ, ఝ, ఞ
    • ట వర్గము - ట, ఠ, డ, ఢ, ణ
    • త వర్గము - త, థ, ద, ధ, న
    • ప వర్గము - ప, ఫ, బ, భ, మ

ఉభయాక్షరములు

ఉభయాక్షరములు 3 అక్షరములు. సున్న, అరసున్న, విసర్గలు.
  • సున్న - దీనిని పూర్ణబిందువు, నిండు సున్న, పూర్ణానుస్వారము అని పేర్లు కలవు. అనుస్వారము అనగా మరియొక అక్షరముతో చేరి ఉచ్చరించబడుట. పంక్తికి మొదట, పదానికి చివర సున్న ను వ్రాయుట తప్పు. అదే విధంగా సున్న తరువాత అనునాసికమును గాని, ద్విత్వాక్షరమును గాని వ్రాయరాదు. ఇవి రెండు రకములు.
    • సిద్ధానుస్వారము - శబ్దముతో సహజముగా ఉన్న అనుస్వారము. ఉదాహరణ: అంగము, రంగు.
    • సాధ్యానుస్వారము - వ్యాకరణ నియమముచే సాధించబడిన అనుస్వారము. ఉదాహరణ: పూచెను+కలువలు = పూచెంగలువలు.
  • అరసున్న - దీనిని అర్ధబిందువు, అర్ధానుస్వారము, ఖండబిందువు అని పేర్లు కలవు. ప్రస్తుతము ఇది తెలుగు వ్యావహారిక భాషలో వాడుకలో లేదు. కానీ ఛందోబద్ధమైన కవిత్వంలో కవులు దీనిని వాడుతారు.
  • విసర్గ - ఇది సంస్కృత పదములలో వినియోగింపబడుతూ ఉంటుంది. ఉదాహరణ: అంతఃపురము, దుఃఖము.

ఉత్పత్తి స్థానములు

ఉత్పత్తి స్థానములు
  • కంఠ్యములు : కంఠము నుండి పుట్టినవి - అ, ఆ, క, ఖ, గ, ఘ, జ్ఞ, హ.
  • తాలవ్యములు : దవడల నుండి పుట్టినవి - ఇ, ఈ, చ, ఛ, జ, ఝ, య, శ.
  • మూర్థన్యములు : అంగిలి పైభాగము నుండి పుట్టినవి - ఋ, ౠ, ట, ఠ, డ, ఢ, ణ, ష, ఱ, ర.
  • దంత్యములు : దంతముల నుండి పుట్టినవి - త, థ, ద, ధ, న, చ, జ, ర, ల, స.
  • ఓష్ఠ్యములు : పెదవుల|పెదవి నుండి పుట్టినవి - ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ.
  • నాసిక్యములు (అనునాసికములు) : నాసిక నుండి పుట్టినవి - ఙ, ఞ, ణ, న, మ.
  • కంఠతాలవ్యములు : కంఠము, తాలువుల నుండి పుట్టినవి - ఎ, ఏ, ఐ.
  • కంఠోష్ఠ్యములు : కంఠము, పెదవుల నుండి పుట్టినవి - ఒ, ఓ, ఔ.
  • దంత్యోష్ఠ్యములు : దంతము, పెదవుల నుండి పుట్టినవి - వ.

ఆధునిక భాషలో వాడుకలో ఉన్న వర్ణమాల

  • అచ్చులు (12): అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఐ, ఒ , ఓ , ఔ,
  • పూర్ణ బిందువు (1): అం (ఒక ఉదాహరణ)
  • నకారపొల్లు (1): క్ (ఒక ఉదాహరణ)
  • హల్లులు (31):
    • క వర్గము - క, ఖ, గ, ఘ
    • చ వర్గము - చ, ఛ, జ, ఝ
    • ట వర్గము - ట, ఠ, డ, ఢ, ణ
    • త వర్గము - త, థ, ద, ధ, న
    • ప వర్గము - ప, ఫ, బ, భ, మ
    • య, ర, ల, వ, శ, ష, స, హ,ళ, క్ష, ఱ

గుణింతాలు

తెలుగులొ, ఒక్కొక్క అక్షరానికి గుణింతాలు ఉన్నాయి. "క" అక్షరానికి గుణింతాలు: క, కా, కి, కీ, కు, కూ, కె, కే, కై, కొ, కో, కౌ, కం, కః

ఒత్తులు

ఒక హల్లుకి ఇంకొక హల్లు చేరినప్పుడు తరువాతి హల్లు చాలా సార్లు తలకట్టులేని రూపమును లేక వేరొక రూపములో కనబడుతుంది. ఉదాహరణకు హల్లు కు అదే హల్లు చేరినప్పుడు కనబడే విధం చూడండి
  • క్క, ఖ్ఖ, గ్గ, ఘ్ఘ, ఙ్ఙ
  • చ్చ, ఛ్ఛ, జ్జ, ఝ్ఝ, ఞ్ఞ
  • ట్ట, ఠ్ఠ, డ్డ, ఢ్ఢ, ణ్ణ
  • త్త, థ్థ, ద్ద, ధ్ధ, న్న
  • ప్ప, ఫ్ఫ, బ్బ, భ్భ, మ్మ
  • య్య, ర్ర, ల్ల, వ్వ, శ్శ, ష్ష, స్స, హ్హ, ళ్ళ, ఱ్ఱ.

అఖండము

కు వత్తు చేర్చినప్పుడు మామూలు ష వత్తు బదులు వేరే రూపం(క్ష) వస్తుంది.

చిన్నప్పుడు  ణ రాయడం రాక దెబ్బలు తినడం మొదటిసారి... ఈ అక్షరాలు చూస్తుంటే నాకైతే ఓ పెన్నిదిని చూసినట్టుగా ఉంది... మనం వాడే మనకు తెలిసిన సంఖ్యలు కూడా తెలుగు సంఖ్యలు కాదు... అవి కూడా మీకోసం...
తెలుగు సంఖ్యలు. ౧. ౨. ౩. ౪. ౫. ౬. ౭. ౮. ౯. ౧౦
                           1. 2. 3. 4.  5.  6. 7. 8. 9.  10.

అమ్మ తో అ ఆ ల అచ్చులు క చ ట ప గ జ డ ద బ హల్లులతో సాగి య ర ల వ లతో నిండి ద్విత్తాక్షరాల లతో  కూడి ఱ తో నిలిచి సంయుక్తాక్షరాల సంయమనంతో గుణింతాల గమ్మత్తులతో చేరిన పసందైన తెలుగు... స రి గ మ ప ద ని సప్త స్వరాల సంగీతానికి ఆద్యమై విలసిల్లుతున్న గానామృతమే మన తెలుగు సాహిత్యం... ఎందరో మహానుభావులు అందరికి వందనాలు...
ప్రాచీన మన తెలుగు సంస్కృతిలో కావ్యాలకు పెద్ద పీట వేసారు ఆ రోజుల్లో.... ఆదికవి నన్నయ్య నుండి తిక్కన, ఎర్రన .... శ్రీనాధ కవిల కావ్యాలతో అలరాలిన తెలుగు గడ్డ  మహా భారత పంచమ వేదాన్ని తెలుగులో అనువదించిన కవిత్రయం... శ్రీనాధుని శృంగార నైషధం,  హర విలాసం, సహజ కవి పోతనామాత్యుని తేనే సొగసుల తీయదనాన్ని అందించిన భాగవతాన్ని... ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ఎన్నెన్నో మధురమైన కావ్యాలు మన సొంతం.... ఇవి మనకు కొన్ని తరాల ముందు ....
విశ్వనాధ వారి వేయి పడగలు మనలో తెలియని వారు అప్పటిలో చాలా తక్కువ.... కృష్ణ శాస్తి కిన్నెరసాని.... తిలక్ సాహిత్యం .... ఒక భాగమైతే గురజాడ, కందుకూరి వీరేశలింగం వీరి నాటక రచనలు ప్రజల్లో ఇప్పటికి చెరగని ముద్రలుగా నిలిచిపోయాయి... కావ్యం, కవిత్వం , వచనం, నాటకం వీటిలో...  ప్రతి ఒక్కరిది ఒక్కో శైలి...తెలుగు నుడికారాలను ఒంపులు తిప్పుతూ ఒక్కో తరం ఒక్కో రకమైన భావుకతను అందించి తెలుగు భాషకు తరగని వన్నెలు అద్దడం మన మహద్భాగ్యం....!!
వివరణ తెలుగు   వికిపీడియా సౌజన్యంతో.....
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....  
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner