30, ఏప్రిల్ 2012, సోమవారం

చెప్పుకోవడానికి....!!

శ్రీరాముని ధనుస్సు గుచ్చుకుని మండూకం మౌనంగా వుంటే కాసేపటికి చూసిన రాముడు అడిగాడంట కనీసం చెప్పలేదు అని....దానికి మండూకం రామా!! బాధ కలిగితే శ్రీరామా..!! నాకీఇబ్బంది వచ్చింది దాని నుంచి రక్షించు అని నిన్ను శరణు కోరతాము కాని బాధే నీ మూలంగా అయితే ఎవరికీ చెప్పుకోను అని అడిగిందంట...రాముడు దేవుడు కనుక మండూకం వెన్ను నిమిరి స్వాంతన కలిగించి ఆ నిమిరిన గుర్తులను దానికి బహుమతిగా ఇచ్చాడు....
మండూకాన్ని మర్చిపోయి ఉడుత అని రాసాను....మహేష్ గారు సరిదిద్దారు ధన్యవాదాలు....
మనమే మనకి ఒక సమస్యగా మారుతుంటే ఎవరికీ చెప్పుకోవాలి...??? లేదా మన అనుకున్న వారే మనలను సమస్యల వలయంలో తోసేస్తూ వుంటే....!!!

28, ఏప్రిల్ 2012, శనివారం

ఎదురుగా నీవుంటే....!!

మంచు ముత్యాల మేలిముసుగు పరదాల చాటునుంచి
దోబూచులాడుతూ తొంగిచూసే తొలిపొద్దు.....
కనిపించి కనిపించని సయ్యాటలాడే వేళ...
రేయి అందాలను సూరీడుకప్పగించి...
జాబిలమ్మ సెలవు తీసుకునే సమయాన...
ఎందరున్నా ఎవరూలేని ఏకాంతంలో...
నీ సాన్నిహిత్యపు అనుభూతిలో
ఓలలాడే వేళ...సుదూర తీరాలలో....
నీ పిలుపు వినిపించిన తన్మయ తాదాత్మ్యంలో...
ఒక్కసారిగా...ఉలికి పడి కనులు తెరిచి
చుస్తే ఎదురుగా నీ రూపం సాక్షాత్కారమే..!!

26, ఏప్రిల్ 2012, గురువారం

దూరం తెలియని గమ్యం..!!


దూరం దూరం తీరం తెలియని గమ్యం
పయనం పయనం అంతే లేని ప్రయాణం
భారం భారం మోయలేని బతుకు బండి బరువు
కోపం కోపం చేతకానితనంతో చిరాకుపరాకు
చేయలేక చేవలేక గెలుపంటే తెలియనితనం
ఎదుటివాడి....
ఓటమిలో మనల్ని వెదుక్కునే క్రమంలో
పతనానికి చిరునామా మనదే...!!
విజయానికి చేరువై గెలుపు పిలుపు
తలుపు తడుతుందేమోనని భయం..!!
చేతగాని తనాన్ని ఒప్పుకోలేక
రుసరుసలతో....విసవిసలతో...
అదే జీవితమనే భ్రమలో.....చక్రభ్రమణంలో...
పరిభ్రమించే చేతగాని వాళ్లకు
గెలుపు సింహాసనం జీవితంలో అందని ద్రాక్ష పుల్లనే...!!

24, ఏప్రిల్ 2012, మంగళవారం

ఎందుకోయి...!!

ఎందుకోయి అంత కోపం....
ఏమి నేరం చేసానని..??
ఎందుకోయి మౌన యుద్ధం....
మాటల దూరం...
మనసుల మద్య అలజడుల అగాధం...
కలతల వెతలలో...కన్నీటి సాక్షిగా...
సేదదీరే క్షణాల కోసం  పరితపించే ప్రాణం...
ప్రేమపాశం వదలనంటుంటే....పోయే ఊపిరి ఆగనంటుంటే...
కదలని కాలం భారమైపోతుంటే...శ్వాస ఆగే చివరిక్షణం...
చిన్ని ఆశతో ఎదురు చూసే....గుండెచప్పుడు వినిపించలేదా..
ఎందుకోయి అంత అలుక...
చేజార్చుకోకు దొరికిన ఆలంబన..
మరలిరాదు మారుతున్న కాలం...
మనసు పగలక ముందే భద్రంగా దాచుకో...
మేలిముత్యాల మంచుతునకని...!!        

20, ఏప్రిల్ 2012, శుక్రవారం

రేపటి తరాలకు.....అందించండి...!!

బంధాలు బంధుత్వాలు అన్ని మొక్కుబడి జీవితాలైపొయాయి... బాధలో వుంటే వీలైతే వెళ్లి పలకరించడం వెళ్ళడానికి వీలుకాకపోతే ఓ ఫోన్ కాల్ తో సరిపెట్టడం పరిపాటి ఐపోయింది...అస్సలు అదే చాలా ఎక్కువగా పలకరిచేసామని ఫీల్ ఐపోతున్నాము....
బాధలో వున్న వాళ్ళు కోరుకునేది చిన్న ఓదార్పు, నాలుగు చల్లని స్వాంతన వచనాలు అదేనండి మాటలు.....అవే కరువై పోతున్నాయి ఇప్పటి కాలంలో....తనకంటూ అందరూ ఉన్నారు అన్న ఒక్క ఉహతో కొండంత బలం వస్తుంది....మనం డబ్బులు ఖర్చు పెట్టనక్కర లేదు కాస్త ధైర్యాన్నివ్వగలిగితే చాలు....అదే కొన్ని కోట్ల విలువ.....
దూరమైపోతున్న ప్రేమాభిమానాల్ని కాస్త బతికించండి ..... రేపటి తరాలకు కూడా కొద్దిగా వాటి రుచి కొద్దిగా మిగలనివ్వండి.....!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner