ఏటి ఆవల జ్ఞాపకాల నడుమన నేను..ఇంటికి పెద్దబిడ్డగా అల్లారుముద్దుగా అందరి మధ్యన గారాబంగా చిన్నతనం. తెలిసీతెలియని వయసులో ఏటిలో దూకుళ్ళతో, ఆటలతో అల్లరి బాల్యం. చదువులోనూ ముందే ఉంటూ ఏమైనా సరే ఇంజనీరు అవ్వాలన్న బలీయమైన కోరికకు బీజం పడింది పెదనాన్న ఇంజనీరని చెప్పే నాన్న మాటలతో. బాబాయి మరణంతో హాస్టల్ చదువు మెుదలు.
అప్పటి వరకు అందరి మధ్యనా వున్న నేను ఒంటరినై పోయానన్న దిగులు. చదువుతూ దిగులును దూరం చేయాలన్న ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఇంజనీరింగ్ సీట్ వచ్చినా, మరో ప్రయత్నంలో కాస్త మెరుగ్గా మంచి రాంక్ వస్తుందని, వచ్చిన అవకాశాన్ని వాయిదా వేసాను. తర్వాత పక్క రాష్ట్రంలో ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాను. అప్పటికే ఇంట్లో అందరికి దూరంగా నేను జరిగానో, వాళ్ళు జరిపారో తెలియకుండానే దూరం పెరిగిపోయింది.
మానసికంగా బాగా ఒత్తిడికి లోనైన మనిషి ఏ అలవాట్లకు బానిస అవుతాడో తెలుసు కదా. నా విషయంలోనూ అదే జరిగింది. స్నేహితులు, బంధువులు నా చుట్టూ వున్నా ఏదో లోటు..మనసులోని బాధను పంచుకోలేని లోటు అలానే మిగిలిపోయింది.
కాలేజ్ అన్నాక గొడవలు, అలవాట్లు అన్నీ మామూలే. అలానే నాలుగేళ్లు గడవడం, అనుకోకుండా ప్రేమలో పడడం, ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవడం జరిగిపోయింది. అసలు జీవితం అప్పుడు మెుదలైంది.
అత్తాకోడళ్ళ అహాల మధ్యన నలిగి, అయినవారితో వున్న దూరం ఇంకా పెరిగిపోయి, నేనే వాళ్ళకు దూరంగా వెళ్ళిపోయాను. పెళ్లి, పిల్లలు బాధ్యతలతో ఉద్యోగాలు చేసుకుంటూ కొన్ని రోజులు, తర్వాత వ్యాపారం చేస్తూ, లాభాలు, నష్టాలు మోసుకుంటూ జీవితాన్ని సాగించాను.
పిల్లలు పెద్దయ్యాక వారి చదువులు, నా సంపాదన కోసం తిప్పలు షరా మామూలే. మనకున్న అలవాట్లు, మానసిక ఒత్తిడి మూలంగా అనారోగ్యాలు చుట్టాలుగా చేరాయి. అయినవారు, పరాయివారు అని లేకుండా అందరు చేసిన నమ్మక ద్రోహాలు, ఆర్థిక ఇబ్బందులు..ఇలా కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్లుగా నా జీవితమూ అర్ధాయువుతో అర్ధాంతరంగా ముసిగిపోతుందని కలలో కూడా ఊహించలేదు.
“అనుకోకుండా ముగిసిన నీ జీవితానికి అశ్రుతర్పణం అనడం తప్ప మరేం చేయలేని నిస్సహాయతరా”.
