14, నవంబర్ 2014, శుక్రవారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ...ఏడవ భాగం....!!

మన తెలుగు సాహితీ ముచ్చట్లలో సాహిత్యపు ఆటల ఛందస్సు గురించి తెలుసుకునే ప్రక్రియలో ఈ వారం మత్తేభవిక్రీడితము గురించి తెలుసుకుందాం... విక్రీడితం అంటే ఆట... మధించిన ఏనుగుల ఆట ఈ మత్తేభవిక్రీడితము... శార్దూలవిక్రీడితము సింహాల ఆట అయితే ఇది మద గజాల గమ్మత్తులాట... ప్రాచీన వృత్తాలలో ఒకటైన శార్దూలవిక్రీడితము  గురించి ఇంతకు ముందు చెప్పుకున్నాము... ఇది సంస్కృత కవులకు ప్రాణాధారము వంటిది... ఓ అజ్ఞాత కవి చేసిన చిన్న ప్రయోగమే మనకు మత్తేభవిక్రీడితమును తెచ్చిపెట్టింది... శార్దూలవిక్రీడితము నందలి మొదటి గురువును రెండు లఘువులుగా మార్చుటే ఈ ప్రయోగము.... ఛందస్సులో మత్తేభం అని మరొక వృత్తమున్నా మత్తేభవిక్రీడితాన్ని మత్తేభమని పిలవడం వాడుకలో ఉంది...

మత్తేభవిక్రీడితము
నలువొందన్ సభరల్ నమల్యవల తోనంగూడి మత్తేభ మిం
పలరారున్ బదునాలు గౌ విరతి చే నానందరంగా ధిపా

లక్షణములు

మత్తేభవిక్రీడితము వృత్తమునందు గణములు
I I U U I I U I U I I I U U U I U U I U
సి రి కిం జె ప్ప డు శం ఖ చ క్ర యు గ ముం జే దో యి సం ధిం ప డే
  • పాదాలు: నాలుగు
  • ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య = 20
  • ప్రతిపాదంలోని గణాలు: స, భ, ర, న, మ, య, వ
  • యతి : ప్రతిపాదంలోనూ 14 వ అక్షరము
  • ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు

ఉదాహరణలు

సవరక్షార్థము దండ్రి పంప జని విశ్వామిత్రుడుం దోడరా
నవలీలం దునుమాడె రాము డదయుండై బాలుడై కుంతల
చ్చవిసంపజితహాటకం గపటభాషావిఫురన్నాటకన్
జవభిన్నార్యమఘోటకం కరవిరాజ త్ఖేటకన్ దాటకన్.

సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే
పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై

మరిన్ని వివరాలు మత్తేభవిక్రీడితము గురించి తెలుసుకోవాలంటే జెజ్జాల కృష్ణ మోహన రావు గారి వ్యాసం ఉన్న ఈ క్రింది లింక్ మీకు ఉపయోగపడుతుంది
http://eemaata.com/em/issues/200609/910.html

నాకు తెలిసిన మత్తేభవిక్రీడితము గణాలు యతి స్థానాలు ప్రాసయతులు.... చిన్న చిన్న ఉదాహరణలు మాత్రమే.... పేరుకు తగ్గట్టుగానే ఈ మత్తేభవిక్రీడితము కవుల చేతిలో ఎంత చక్కగా ఒదిగి పోయిందో దీని పుట్టుపుర్వోత్తరాల గురించి లోతుగా చూస్తే తెలిసింది.... ఎంత చక్కని పద్యరాజాలు నవరసాలను ఈ మత్తేభవిక్రీడితములో అందించాయో... అద్భుతమైన మన ఛందస్సులో కవులకు ఆట వస్తువుగా శార్దూలవిక్రీడితంతో పాటు మత్తేభవిక్రీడితము కూడా అమరినది... నవరసాలలోని కొన్నిపద్య ఉదాహరణలు మీకు జె కె మోహనరావు గారి వ్యాసం నుంచి అందిస్తున్నాను..... నేను తెలుసుకున్న వివరాలు అందరికి తెలియజెప్పాలన్న కుతూహలము తప్ప మరి ఏ ఉద్దేశ్యము నాకు లేదు....

జెజ్జాల కృష్ణ మోహన రావు గారి వ్యాసం నుంచి వివరాలు సంగ్రహముగా....  
దక్షిణాదిన కర్ణాటక మత్తేభవిక్రీడితానికి జన్మస్థానం... రెండవ పులకేశి కాలంలో మొదటగా దీనిని సంస్కృతంలో వాడారు..... తెలుగు శాసనములలో పన్నెండవ శతాబ్దమునకు ముందు మత్తేభవిక్రీడితము వాడుకలో లేదు... భారతములో మొదటి మత్తేభము అరువది ఆరవ పద్యము! అది-
అమితాఖ్యానక శాఖలం బొలిచి, వేదార్థామలచ్ఛాయమై
సుమహద్వర్గ చతుష్కపుష్పవితతిన్ శోభిల్లి, కృష్ణార్జునో-
త్తమ నానాగుణ కీర్తనార్థఫలమై, ద్వైపాయనోద్యాన జా-
త మహాభారతపారిజాత మమరున్, ధాత్రీసురప్రార్థ్యమై
– నన్నయభట్టు, ఆదిపర్వము (1.66)
ఇంచుమించు ఇదే భావములతో ఇంతకంటె సుందరముగా బమ్మెర పోతన భాగవత అవతారికలో క్రింది పద్యమును వ్రాసినారు. అది కూడ ఒక మత్తేభమే.
లలితస్కంధముఁ, గృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం-
జులతాశోభితమున్, సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్, సుందరో-
జ్జ్వల వృత్తంబు, మహాఫలంబు, విమల వ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్య కల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై
– పోతన, భాగవతము (1.20)
పద్యం పేరును పద్యంలో వచ్చేటట్లుగా రాస్తే అది ముద్రాలంకారం అవుతుంది.... నన్నయగారి క్రింది పద్యమునకు ముద్రాలంకారపు పోలికలు గలవు. ఇది శకుంతలాదుష్యంతుల కుమారుడైన భరతుని బాల్య  క్రీడలను వర్ణించు పద్యము.
అమితోగ్రాటవిలోనఁ గ్రుమ్మరు వరాహ వ్యాళ శార్దూల ఖ-
డ్గ మదేభాదులఁ బట్టి తెచ్చి, ఘనుఁడై కణ్వాశ్రమోపాంత భూ-
జములం దోలిన కట్టుచుం బలిమిమై శాకుంతలుం డొప్పె వ-
న్య మదేభంబుల నెక్కుచుం దగిలి నానా శైశవక్రీడలన్
– నన్నయ భట్టు, ఆది (4.64)
శార్దూలమత్తేభవిక్రీడితాలు వీరరసపోషణకై ఎక్కువగా ఉపయోగించబడినవి. మత్తేభమును కవులు శౌర్యరసముతోబాటు మిగిలిన అన్ని రసములను వర్ణించుటకు కూడ ఉపయోగించారు. ఇది ఎలా అవుతుంది అని అనుకోవచ్చు. శార్దూలవిక్రీడితములోని మొదటి గురువును రెండు లఘువులుగా చేయుటవలన పదలాలిత్యము సాధ్యమవుతుంది. మూడు గురువులు ఒక్కుమ్మడిగా వస్తే సంస్కృత పదాలను వాడాలి (భీష్మద్రోణకృపాదిధన్వినికర్ఆభీలంబు …) లేకపోతే బిందువుతోనో, ద్రుతముతోనో, పదాలను విరగగొట్టి వాడాలి (సింగంబాకటితో …). కాని మొదటి గురువు లఘువైనప్పుడు మనకు పదప్రయోగానికి అవకాశాలు ఎక్కువవుతాయి. అందుకే శార్దూలవిక్రీడితముకన్న మత్తేభవిక్రీడితాలు తెలుగులో ఎక్కువ. దీనిని నిరూపించుటకు క్రింద కొన్ని పద్యములను చూడండి . అనుభూతులు కలిగించే నవరసములు ఆలంకారికుల దృష్టిలో ఇవి- శృంగారము, హాస్యము, కరుణ (శోకము), వీరము, రౌద్రము, భయానకము, బీభత్సము, అద్భుతము, శాంతము. విన్నకోట పెద్దన కావ్యాలంకారచూడామణిలో వీనిని ఈ క్రింది విధముగా వివరించెను-
క్రమమున శృంగారము హా-
స్యముఁ గరుణము రౌద్ర వీర సంజ్ఞంబులు ఘో-
రము బీభత్సము నద్భుత
సమాఖ్య శాంతములు ననగఁ జను నవరసముల్
– పెద్దన, కావ్యాలంకారచూడామణి, (2.88)

 వీరరసం :
మగుడం గీచకుఁ బట్ట, వాఁడును బలోన్మాదంబునన్, బాహుగ-
ర్వగరిష్ఠుం డగు నా హిడింబరిపుఁ దీవ్రక్రోధుఁడై పట్టి బె-
ట్టుగఁ ద్రోపాడఁగ నిద్దఱున్ భుజబలాటోపంబుమై నొండొరున్
మిగులం జాలక కొంతసేపు వడి మేమేఁ బోరి రుగ్రాకృతిన్
– తిక్కన, విరాట (2.343)
శృంగారరసం :
అతి మోహోన్నతి తారఁ బాసి, శశి చింతాక్రాంత చిత్తంబుతో
వెతతో వెంకకు నీడ్చు పాదములతో విభ్రాంతి భావంబుతో
ధృతిహీనస్థితితో దృగంచల సముద్వేలాశ్రుపూరంబుతో
మతిఁ జింతించుచు వేఁగి యొక్క వనసీమన్ గుంజ గర్భంబునన్
-వేంకటపతి, శశాంకవిజయము (4.46)

 ఇలా అన్ని రసాల పోషణ మత్తేభవిక్రీడితానికి చెల్లింది...చివరిగా అందరికి తెలిసిన రెండు మత్తేభాలు
పైన చెప్పిన ఉదాహరణములతో మత్తేభవిక్రీడితవృత్తపాత్రలో ఏ రసమునైనను నింపుటకు సాధ్యము అని తెలుస్తోంది. ఈ సాహితీ ముచ్చట్లు  ముగించే ముందు అందరికి చిరపరిచితమైన ఒక రెండు మత్తేభవిక్రీడితములు మీకోసం ..  పోతన గజేంద్రమోక్షములో, వామనచరిత్రలో, రుక్మిణీకళ్యాణములో రసవత్తరమైన మత్తేభవిక్రీడితములు ఉన్నాయి. వాటిలో రుక్మిణీకల్యాణ ఘట్టములోని క్రింది పద్యమును ఎరుగనివారు అరుదు. చదువురానివారు కూడ కంఠతా పట్టిన పద్యములలో ఇది ఒకటి.

ఘనుఁ డా భూసురుఁ డేగెనో నడుమ మార్గశ్రాంతుఁడై చిక్కెనో
విని కృష్ణుం డది తప్పుగాఁ దలచెనో విచ్చేసెనో యీశ్వరుం
డనుకూలింపఁ దలంచునో తలఁపడో యార్యామహాదేవియున్
నను రక్షింప నెఱుంగునో యెఱుఁగదో నా భాగ్య మెట్లున్నదో
– పోతన, భాగవతము (10.1.1725)
రెండవ పద్యము నంది తిమ్మనగారి పారిజాతాపహరణములోనిది. 
జలజాతాసన వాసవాది సుర పూజా భాజనంబై తన-
ర్చు లతాంతాయుధు కన్న తండ్రి శిర మచ్చో, వామ పాదంబునం
దొలఁగంద్రోచె లతాంగి, యట్ల యగు, నాథుల్ నేరముల్ సేయఁ, బే-
రలుకం జెందిన యట్టి కాంత లుచితవ్యాపారముల్ నేర్తురే
– తిమ్మన, పారిజాతాపహరణము- 1.121

 ఒకే మట్టితో కుమ్మరివాడు ఎన్నో రకాల పాత్రలను చేస్తాడు. అదే విధముగా ఒక మత్తేభవిక్రీడితవృత్తములో ఎన్ని రసముల నైనను నింపవచ్చు. కవీంద్రుల కలములో ఈ మత్తగజము ఎన్ని ఆటల నాడిందో, ఎన్ని పాటలను పాడిందో, ఎన్ని గుండెలను తాకిందో, ఎన్ని అనుభూతులను కలిగించిందో. ఈ ఏనుగుల ఆట నవరసాలకు బాటయే!
 నవమాలల్ బలు గూర్చవచ్చు వరవీణాపాణి పూజార్థమై
నవరాగమ్ములఁ బాడవచ్చు రసవిన్యాసమ్ముతోఁ, జిత్తసం-
భవభావమ్ముల వ్రాయవచ్చు రహితో మత్తేభవిక్రీడిత-
మ్మవ, హృద్యమ్ముగ నింపవచ్చుఁ గవితన్ మందారమాధుర్యముల్.
వివరణ - జెజ్జాల కృష్ణ మోహన రావు గారి సౌజన్యంతో .....
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner