20, నవంబర్ 2014, గురువారం

నా దృష్టిలో గొప్ప కవితలు...!!

 నీకెలా తెలుసు బంగారూ....!!

కలలోని కధలో నీవెవ్వరో....!!
కనుల ఎదుట నీవున్నా....
కనిపెట్టలేని నేనెవ్వరో....!!

అస్పష్టమైన నీ రూపాన్ని
కరిగిపోయిన కలలో కాంచి
స్పష్టంగా గీయాలన్న నా యత్నం....!!

అమ్మదనపు హక్కుతో
నాలో చేరిన నువ్వు
నా ప్రతి రూపంగా నాలో నీ
ఆకారాన్ని పొందే ప్రయత్నంలో....!!

నీ స్పర్శ సుతి మెత్తగా తగిలి
నాలో నువ్వున్నావని గుర్తించిన వేళ...!!
నాలోని మమకారమో...
నీలొని మాయాజాలమో...
నాకే తెలియకుండా నా తలపులన్ని నీతోనే...!!

ఆకృతి లేని నీకు అర్ధం కాదనుకున్న
నా మనసు భాష నీకు తెలిసిందో...!! ఏమో ...!!
నీ కదలికల అలజడితో...
భాష తెలియని బంధంతో
పాశాన్ని పెనవేసుకున్నావు నాతో...!!

ఎప్పుడెప్పుడు నిను చూస్తానా...!!
కలలోని ఊసులు నిజంగా నీతో చెప్పాలని...
నాలో జీవమైన నీ సజీవ చిత్రాన్ని 
చూసుకోవాలని పడే తాపత్రయం....!!

నా గీతల్లో ఉంది నువ్వే అని
నా ఎదురుగా ఉన్న నీ చిత్తరువు చెప్తున్నా....
నా ప్రతిరూపమైన అపురూపమైన
నీ ఆగమనం కోసం ఆత్రంగా
ఎదురు చూస్తున్న అమ్మని
నేనే అని నీకెలా తెలుసు బంగారూ....!!

ఈ పై కవిత నేను ఒకే ఒకసారి తానా పోటీలకి రాసిన కవిత... చాలా ఇష్టంగా రాసిన మనసు కవిత ఇది... పోటీలకి రాయడం నా స్వభావానికి విరుద్దం కాని మనసుకు నచ్చిన అంశం కనుక ఎందుకో రాయాలనిపించి రాశాను.... గెలుపొందలేదు కాని మన ముఖ పుస్తకంలో పెడితే ఈ కవితకు వచ్చిన స్పందనలకు అక్కడి గెలుపు కన్నా ఎక్కువ సంతోషం అందింది... ఆ ఆనందాన్ని మాటలలో చెప్పలేను ... చాలా తక్కువగా పోటీలకి రాస్తుంటాను... ఎందుకో తెలియదు మనసుకు అనిపించింది రాయడమే తెలిసిన నాకు పోటీలకి రాసే స్థాయి లేదని నా అభిప్రాయం... అందుకనే రాయను... బహుమతి రానంత మాత్రాన మనసుకు నచ్చి రాసిన కవితలు ఎందుకు పనికిరానివి కాదు... ఆ సమయంలో న్యాయ నిర్ణేతలకు మరొక అంశంలోని కవిత నచ్చి ఉండవచ్చు... లేదా గొప్ప కవితలను అర్ధం చేసుకోగలిగిన స్థాయి పిన్న వయసు వారికి ఉండక పోవచ్చు... మన అందరి ఇష్టాలు ఒకేలా ఉండవు కదా.... ఒక్కొక్కరికి ఒక్కో అంశం నచ్చుతుంది... పోటికి రాసిన ప్రతి ఒక్కరు గెలుపు ఆనందాన్ని రుచి చూడాలనే కోరుకుంటారు... కాకపొతే కొందరే ఆ ఆస్వాదన అనుభవిస్తారు... గెలుపొందని కవితల స్థాయి తక్కువ కాదు గెలిచిన కవితల భావన ఎక్కువా కాదు... మన మనసుకు నచ్చితే అంతకన్నా ఇంకా ఏ గెలుపు కావాలి చెప్పండి... ఇక బహుమతులంటారా అవి గొప్ప కవితలకు అవసరం లేదు... బహుమతి ఇస్తే వారిని చిన్నతనం చేసినట్లే... ఎందుకంటే కొన్ని కవితల్లో భావాలకు శిరస్సు వంచి నమస్సులు చెప్పడం తప్ప మరే విధమైన విలువను ఆపాదించలేము.... అంత గొప్పగా ఉంటాయి అవి... పోటీలు నామ మాత్రాలు... అందరి మనసులను గెలుచుకునే కవితలే నా దృష్టిలో గొప్ప కవితలు...!! ఇది నా మనసులో మాట... ఎవరిని బాధ పెట్టడానికి రాసినది కాదు నాకు నేను సమాధానం చెప్పుకోవడానికి రాసుకున్నది... పెద్ద మనసుతో తప్పుగా ఏమైనా రాస్తే క్షమించండి...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner