నాన్న చనువుగా నేర్పిన ఆటల అల్లరి
చదువు చెప్పిన గురువుల నీతి పాఠాలు
పసితనాన్ని పసిడి తునకగా మార్చినా....
నేర్చుకున్న నాణ్యత కోసం నడతను మార్చుకొనక
నేస్తాల సాహచర్యాన్ని స్వాగతిస్తూ సాగిన సందడి
పండుగల పరవశంలో పండించిన సంతోషాలు
సంస్కృతి సంప్రదాయాలను మరువని కౌమారం దాటుతూ....
కొత్త వింతల సరదాల లోకంలో మరచిన నైతికత్వం
ఉగ్గుపాల విలాసాల విన్యాసాల విపరీతాలు
విలక్షణ అర్ధాల వింత పోకడలు చూపిస్తూ
అమ్మ ప్రేమకు ధీటుగా యుక్త వయసు మైత్రిలో మునుగుతూ...
జతను చేరిన అనుబంధానికి గుర్తుగా మరో ప్రస్థానానికి నాందిగా
మొదలైన జీవిత సమర ప్రాంగణంలో అతిధిగా నిలిచి
నిలకడ కోసం నిరంతర యత్నాల కోరికల సాఫల్యం కోసం
ఎటు కాని మధ్యస్థంలో కొట్టుమిట్టాడే ప్రాణం వగచే నడివయసూ....
బాధ్యతల బంధాలను దాటుకుని బాసట కోసం తపించే తనువు
ఆత్మీయత కొరవడి గతాన్ని తలుస్తూ గాయాలను చేసుకుంటూ
జ్ఞాపకాలను ఓదార్పుగా... నిట్టూర్పుల స్నేహంలో నిదురించే
కాలాన్ని ఒక్కసారి వెనుకకు మరలమనే చివరిదశ ఈ ముసలితనమూ...
పుట్టినప్పుడు పాలకేడ్చినా వయసుపొంగులో ముద్దుమురిపాలకైనా
నా అన్న బాధ్యతల కోసం తప్పులేదంటూ న్యాయాన్ని ఏడిపించినా
ఒకనాడు నైతికతను మరచి అనైతికానికి పట్టంకట్టినా తెలియని
మనసు రోదన వినిపించిన క్షణాలు... అవే రెప్ప పడిన మలి సంతకాలు...!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి