27, డిసెంబర్ 2014, శనివారం

అనుమాన భూతం....!!

నేస్తం....
            ఎలా ఉన్నావు... నేనైతే బావున్నా అని చెప్పలేక పోతున్నా... ఎటు చూసినా ఏదో ఒక సమస్య ప్రతి ఒక్కరికి... వయసు పెరిగితే మానసిక పరిణితి పెరుగుతుందని అనుకోవడం పొరపాటేమో అనిపిస్తోంది... వయసు మీరుతున్న కొద్ది మరీ చిన్నపిల్లల మనస్తత్వం ఎక్కువై పోతోంది.... రాను రాను ఇంట్లో పిల్లలతో మాట్లాడినా సహించలేని మానసిక స్థితిని చేరుతున్నారేమో కొందరు అనిపిస్తోంది... ప్రేమ ఎక్కువగా ఉండవచ్చు అది తప్పు కాదు కాని ఎదుటివారి మీద అపనమ్మకంగా ఈ ప్రేమ ఉండకూడదు.... నేను చూసిన చాలా అనుబంధాలలో ఈ మార్పుని ఎక్కువగా చూస్తున్నా ఈ మద్య కాలంలో.... కొందరేమో ఫోనుల్లో గడపడాన్ని ఇష్టపడుతున్నారు, మరి కొందరేమో అంతర్జాలంలో, ఇంకొందరు టెలివిజన్లలో సీరియల్స్ చూస్తూ.... ఇలా తమ సమయాన్ని గడిపేస్తున్నారు... వాళ్ళు ఇలా గడపడానికి కొంత వరకు వారి చుట్టూ ఉన్న వాతావరణం, వ్యక్తులు కారణం కావచ్చు... కాని ఆ మాట అంటే వారు ఒప్పుకోరు... ప్రేమ అంటే వేల జన్మలకు తోడుగా మళ్ళి మళ్ళి కావాలనిపించేదిగా ఉండాలి కాని అనుమానం అనే భూతంలో మన ప్రేమ నలిగిపోయి మానవ బంధాల మీదే విరక్తి వచ్చేదిగా మిగిలి పోకూడదు... ఎక్కడో చదివిన గుర్తు అమ్మాయిలకు నడి వయసు లక్షణాలు వచ్చేసరికి కొన్ని మార్పులు ఉన్నట్లే అబ్బాయిలకు కూడా ఈ నడి వయసులో తమ మీద తమకే అనుమానం పెరిగి అది తాము పెంచుకున్న మొక్కలను నరుక్కునే స్థితికి తీసుకు వెళ్ళేంత వరకు వస్తుంది అని... ఈ అనుమానం భూతానికి ఆడ మగ తేడా లేదు ఎవరినైనా ఆవహిస్తుంది కాస్త చోటు ఇస్తే చాలు అల్లుకుపోతుంది... దాన్ని వదిలించుకోవడం చాలా కష్టం ... ఎంత చదువుకున్న వాళ్ళయినా దీనికి దాసోహమై పోతున్నారు... ఎన్ని వసంతాలు కలసి బ్రతికినా భార్యా భర్తలలో చిన్న అనుమానం చాలు ఆ బంధం విచ్చిన్నమై పోవడానికి.... కలసి  పంచుకున్న సంతోషాలు కాని బాధలు కాని మర్చిపోయి తెగతెంపుల వరకు వచ్చేస్తున్న బంధాలు ఎన్నో.. మరికొన్నేమో ఎవరో ఒకరు సర్దుకు పోవడంతో మనసులు విరిగినా అలానే ఉంటున్నాయి పిల్లల కోసం... భార్యాభర్తలు ఇద్దరు కాస్త అహాలను వీడి అనుమానాలను వదలి అపార్ధాలు మరచి కొద్దిగా అనుకూలంగా మెలిగితే ఎన్నో బంధాలు విడాకుల పాలు కాకుండా ఉండేవి... ఇద్దరిలో ఎవరికైనా కావాల్సింది కాస్త ఓదార్పు ... మరికాస్త నమ్మకం... నమ్మకం లేని చోట ప్రేమ అస్సలు ఉండదు... ఉందని అనుకుంటే అది పొరబాటే అవుతుంది... ప్రేమ ఉందని చెప్పినా అది నటనే... ఇన్నాళ్ళ కాపురం తరువాత నటన ఎంత వరకు అవసరమో ఒక్కసారి ఆలోచించుకుంటే ఏ ఒక్కరైనా మీతో పాటు నడిచే మీ భార్య/భర్త తో పాటు పిల్లలు కూడా అదృష్టవంతులు అవుతారు.... ఏం నేస్తం నేను చెప్పింది కాదంటావా... నమ్మకం లో నుండి వచ్చే ప్రేమ శాశ్వతం... అనుమానంలో పుట్టిన ప్రేమ అబద్దం కదూ.... మరి ఈ అనుమాన భూతానికి పరిష్కారం ఏంటో నీకు తెలిస్తే చెప్పవూ....
నీ నెచ్చెలి

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner