26, డిసెంబర్ 2014, శుక్రవారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ... పదమూడవ భాగం....!!

మన తెలుగు సాహితీ ముచ్చట్లలో వారం వారం కాస్త తెలుగు సాహిత్యంతోపాటుగా ఛందస్సు గురించి కూడా చెప్పుకుంటూ ఉన్నాము కదా... ఈ వారం
ప్రాఙ్నన్నయ యుగముతో పాటు ఆ యుగములో పుట్టిన అతి ప్రాచీనమైన తరువోజ ఛందో రీతిని తెలుసుకుందాం.. దానితోపాటు అక్కరల గురించి కూడా చూద్దాము... 

తెలుగు సాహిత్యంలో క్రీ.శ. 1000 వరకు ప్రాఙ్నన్నయ యుగము అంటారు. తెలుగులో మొదటి కావ్యం మదాంధ్ర మహాభారతం అనీ, అది ఆరంభించిన నన్నయ ఆదికవి అనీ సార్వత్రికమైన అభిప్రాయం. ఒక్కమారుగా అంత పరిణతి చెందిన కావ్యం ఆవిర్భవించడం అసాధ్యమనీ, అంతకు ముందే ఎంతో కొంత సారస్వతం ఉండాలనీ సాహితీ చరిత్రకారులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నా ఏ విధమైన లిఖిత సాహిత్యం గాని, లిఖిత సాహిత్యం ఆధారాలు గాని లభించనందున తెలుగు సాహిత్యావిర్భావానికి నన్నయనే యుగపురుషునిగా అంగీకరిస్తారు. కనుక నన్నయకు పూర్వకాలాన్ని ప్రాఙ్నన్నయ యుగం అని వ్యవహరిస్తున్నారు.

ఏమైనా తెలుగుభాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు. అయినా కూడా, క్రీ.పూ. మొదటి శకంలో శాతవాహన రాజులు సృష్టించిన "గాధాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత్ పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారై ఉంటారని నిర్ణయించవచ్చు. తెలుగు భాష మూలపురుషులు యానాదులు. పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2,400 సంవత్సరాలనాటిది.

ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర క్రీస్తుకు పూర్వం కొన్ని శతాబ్దాల వెనకకు మనము తెలుసుకోవచ్చు, కానీ తెలుగు చరిత్రను మనము క్రీస్తు శకం 6 వ శతాబ్దము నుండి ఉన్న ఆధారములను బట్టి నిర్ణయించవచ్చు. తెలుగు లోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శకం ఎ.డి. కి చెందినది. శాసనాలలో మనకు లభించిన తొలితెలుగు పదం 'నాగబు'. చక్కటి తెలుగు భాషా చరిత్రను మనము క్రీస్తు శకం 11 వ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడినదిగా గమనించ వచ్చు.
ఆంధ్రులగురించి చెప్పిన పూర్వపు ప్రస్తావనలలో ఒకటి ఇక్కడ ఉదాహరింపబడినది:
పియమహిళా సంగామే సుందరగత్తేయ భోయణీ రొద్దే
అటుపుటురటుం భణంతే ఆంధ్రేకుమారో సలోయేతి
ఇది ఉద్యోతనుడు ప్రాకృతభాషలో రచించిన కువలయమాల కథలోనిది. ఈ ప్రాకృతానికి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి తెలుగు అనువాదం.

తరువోజ

తరువోజ ఛందోరీతి అత్యంత ప్రాచీనమైన తెలుగు పద్య ఛందోరీతుల్లో ఒకటి. ప్రాఙ్నన్నయ యుగముగా పేర్కొనే 9వ శతాబ్ది నాటి పండరంగని నెల్లూరి శాసనంలోని పద్యం తరువోజ ఛందస్సులో ఉండడాన్ని పరిశోధకులు గుర్తించారు.

లక్షణములు

  • పద్యమునకు నాలుగు పాదములుండును.
  • పాదమునకు మూడు ఇంద్ర గణములు, ఆ పైన ఒక సూర్య గణము, మళ్ళీ మూడు ఇంద్ర గణములు, ఒక సూర్య గణము ఉండవలెను.

యతి

పాదములోని మొదటి అక్షరమునకు మూడు చోట్ల యతి ఉండవలెను.
పాదాది అక్షరమునకు పాదంలోని మూడవ, ఐదవ, ఏడవ గణముల మొదటి అక్షరముతో యతి నియమమున్నది.

ప్రాస

రెండవ అక్షరమున ప్రాస నుంచవలెను.

గమనిక

ఒక్కొక్క తరువోజ పాదము రెండు ద్విపద పద్యపాదములు కలసిన రీతిలో (అనగా ఒక ద్విపద పద్యము వలె) ఉంటుంది. ఒకే ఒక భేదమేమిటంటే ప్రతి పాదంలో మూడు చోట్ల యతి కలుస్తుంది - అంటే ద్విపద పద్యములోని రెండు పాదములకూ సాధారణంగా ఉండే యతి కాక పాదాల మొదటి అక్షరములకు కూడా యతి నుంచవలెను. అప్పుడు మొదటి అక్షరముతోనే రెండు పాదములకు మొత్తమూ యతి చెల్లించినట్టు అవుతుంది.

ద్విపద నుంచే తరువోజ పుట్టిందని ఒక అభిప్రాయం.  కాదు, తరువోజనుంచే ద్విపద పుట్టిందని ఇంకొక అభిప్రాయం. ఏదేమైనా, రెండు ద్విపద పాదాలు కలిస్తే తరువోజ అవుతూండడం, రెండూ ఒకే కోవకు చెందినవని చెప్పకనే చెప్తాయి. స్త్రీల దంపుళ్ళ పాటలు చాలా ద్విపదలు, తరువోజలే.

“దంపు దంపనియేరు అది యెంత దంపు
ధాన్య రాసుల మీద చెయ్యేసినట్లు
వంట వంటనియేరు అది యెంత వంట
వదినతో మరదళ్ళు వాదాడినట్లు”
“నొష్ట రాసిన రాలు తుడిచినా పోదు
పైట చెంగులు పెట్టి పులిమినా పోదు”
“కన్న తల్లిని బోలు చుట్టాలు లేరు
పట్టు చీరను బోలు చీరల్లు లేవు”
ఇవన్నీ ద్విపద ఛందంలో ఉన్న పాదాలే. యతిప్రాసలు, పాదనియమాలు ఉన్న చోట్ల ఉన్నాయి, లేని చోట్ల లేవు.  ఉన్న చోటల మాటెలా ఉన్నా, లేని చోటల లేక పోవడంవలన పాటలకు జరిగిన నష్టమేమీ కనిపించదు.

తరువోజ ఉదాహరణ:
ఈ విల్లు మోపెట్టి యేను బాణముల నీ యంత్రమత్స్యంబు నేసిన వాఁడ
భావజప్రతిముఁ డిబ్బాలకుఁ దగిన పతి యిది మునిశక్తిఁ బడసిన విద్య
గావున మీ రిప్డుగావింపుఁ డిదియ ఘనతర కార్ముక కౌశలోన్నతియు
లావును గలవారలకు నవసరము లలితయశంబుఁ గల్యాణంబుఁ బడయ.

తెలుగు లో మొట్టమొదటి పద్యం.

తెలుగు బాష లో మొదట రాయబడినదని చెప్పబడే పద్యం తెలుసు కుందాము.
క్రీస్తు శకం ౮౪౮ వ సంవత్సరం లో పండరంగుని అద్దంకి శాసనం లోని తరువోజ పద్యం.
పట్టంబు గట్టిన ప్రధమంబు నేడు
బలగర్వ మొప్పంగ బై లేచి సేన
పట్టంబు గట్టించి ప్రభు పండరంగు
బంచిన సామంత పడువతో బోయి
కొత్తముల్ పండ్రెండు గొని వేంగి నంటి
గొల్చి యాత్రి భావనాంకుశ బాణ నిల్పి
కట్టె దుర్గంబు గడు బయల్సేసి,
కందుకూర్బెజవాడ గావించి మెచ్చి
దీనికి ముందుగా ఎందఱో పెద్దలు పద్యాలు రాసి ఉంటారు, అయితే శాసనాలు లభించిన మేరకు యీ పద్యం మొదటిది గ ఆర్యులు చెప్తూ ఉంటారు.

అక్కరలు 

ఇది అక్షర శబ్ద భవము. కన్నడంలో ఈ ఛందస్సుకు అక్షర అని పేరు. తెలుగులో అక్కర లన్నారు. జానపద గీతాలలో వలె ప్రతి గణము నొకమారు విచ్ఛేదము ఉండునని “ పాదే పాదే ప్రతి గణ మపి యతి ర్లక్ష్యతే సర్వేషాం మక్షరాణాంచ” అని చెప్పుటచే ఇవి జానపద గీత జన్యములని తెలియు చున్నది. అక్కరలలో చంద్ర గణముల ఉపయోగముండును       ( మధ్యాక్కరలో తప్ప). ఇవి చాలా ప్రాచీనమైన శాసన సాహిత్యములో సహితము లభించుచున్నవి. యుద్ధమల్లుని బెజవాడ శాసనములో (క్రీ.శ. 898-934) మధ్యాక్కర, వెంకయ చోడుని దొంగలసాని శాసనములో (క్రీ.శ. 991) మహాక్కర లభించుచున్నవి. కన్నడాంధ్రములు ఏకభాషగా ఉన్న కాలము నుండే అక్కర ఛందస్సు లుండి యుండును.
అక్కరలు జాతి పద్యములు. ఇవి ఐదు విధములు.

  1. మహాక్కర
  2. మధ్యాక్కర
  3. మధురాక్కర
  4. అంతరాక్కర
  5. అల్పాక్కర

మహాక్కర, మధ్యాక్కర, మధురాక్కర, అంతరాక్కర, అల్పాక్కర అని ఇవి 5 విధములు. వరుసగా 7,6,5,4,3 గణము లొక్కొక్క దానికి పాద పాదమున కుండును.

ఒక్కో పాదమునకు          సూర్య   ఇంద్ర     చంద్ర     మొత్తము గణములు       యతి

1.      మహాక్కర         1         5        1                   7                  4గ.  మీద

2.      మధురాక్కర      1         3        1                   5                   3గ.   మీద

3.      అంతరాక్కర       1         2        1                   4                  3గ.  చివరి అక్షరం

4.      అల్పాక్కర         -         2        1                   3                   2గ.   మీద

5.      మధ్యాక్కర        2ఇంద్ర   1 సూర్య 2 ఇంద్ర 1 సూర్య  6               3గ.   మీద

    మహాక్కరలో పాదానికి ఏడు గణాలు ఉండును. మహాక్కర నుండి అల్పాక్కరకు వచ్చేటప్పటికి పాదానికి ఒకో గణము తగ్గుతూ అల్పాక్కరలో మూడు గణాలు మాత్రమే ఉండును. మధ్యాక్కరకు తప్ప మిగిలిన అక్కరలకు పాదము చివరిలో చంద్ర గణము రావలెన్ననియము ఉన్నది. అక్కరలలో సూర్య గణము లేని అక్కర అల్పాక్కర, అదేవిధముగా చంద్ర గణము పాదాంతములో లేని అక్కర మధ్యాక్కర.

    సేకరణ : వికీపీడియా నుండి మరియు మల్లిన నరసింహారావు గారి వ్యాసం  నుంచి

    వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....


    0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

    Related Posts Plugin for WordPress, Blogger...
     

    కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner