19, మే 2021, బుధవారం
కొందరికే నచ్చే రచయిత గురించి నాలుగు మాటలు... !!
ఎన్నో ఆలోచనలు, విభిన్న అనుభవాల సమాహారమే మానవ జీవితం. మనసుకు అనిపించిన దానిని దేనికి వెరవక సూటిగా చెప్పేవారు కొందరే. ఆ కొందరిలో ఆనాటి సమాజం వెలివేసిన రచయిత చలం. సాహిత్యానిక, సంగీతానికి హద్దులుండకూడదని చెప్పిన తన వారసురాలు అభినందనీయురాలు.
తెలుగు సాహిత్యంలో గూడిపాటి వెంకట చలం గారు తెలియని వారుండవచ్చు, కాని చలం అంటే తెలియని వారు బహు అరుదు. ఈయన ఎదుర్కున్నన్ని సాహిత్య విమర్శలు ఎవరూ ఎదుర్కొని ఉండరన్నది జగమెరిగిన సత్యం. నా చిన్నప్పుడు మైదానం చదివాను కాని ఆ వయసులో అర్థం కాలేదు కాని, దానిలో ఏదో బాధ, ఎవరి గురించో తపన ఉందని అనిపించింది.
చలం చెప్పిన స్వేచ్ఛను అర్ధం చేసుకోలేని సమాజం ఆయనను సభ్య సమాజం నుండి వెలి వేసినా, ఆయన, ఆయన భార్యాపిల్లలు ఎన్ని ఇబ్బందులు పడినా, తను అనుకున్నది సూటిగా, స్పష్టంగా చెప్పేసిన గూడిపాటి వెంకట చలం గారు ఈరోజు తెలుగు సాహిత్యంలో చిరస్మరణీయుడు.
చిన్నప్పటి నుండి తన చుట్టూ చూసిన సంఘటనలు చలం మనసులో ముద్రపడి అవే రాతలుగా ప్రపంచానికి పరిచయమయ్యాయి. సనాతన సాంప్రదాయాలు లోతుగా పాతుకుపోయిన ఆ రోజుల్లోనే నిర్భయంగా స్త్రీ స్వేచ్ఛను గురించి చెప్పిన ఆయన రచనలను సమాజం స్వీకరించలేక పోయింది. ఆయన రచనల్లో బూతును చూసింది కాని స్వేచ్ఛకు, విశృంఖలత్వానికి తేడాను తెలుసుకోలేక పోయింది. ఆయన జీవితం మన అందరికి తెరిచిన పుస్తకమే కనుక కొత్తగా ఏమీ నేను చెప్పనక్కర్లేదు. శ్రీ శ్రీ గారికి రాసిన ముందు మాటలు, భగవద్గీత గురించి విశ్లేషణ చదివితే ఆయన తత్వం మనకు అర్థం అవుతుంది. జీవితంలో అన్ని కోణాలను చవి చూసిన మనీషి.
తాత్వికుడు, మేధావి, ఆధునిక సమాజం పట్ల అపారమైన ప్రేమ, మూఢాచారాలను ఎదిరించిన సాహసి అయిన చలం గారి పుట్టినరోజున ఇలా నాలుగు మాటలు మీ అందరితో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది.
ఇది రాయడానికి కారణమైన దాడి చంద్రశేఖర రావు గారికి మన:పూర్వక ధన్యవాదాలు. మాట్లాడం రాని నాతో ఓపికగా మాట్లాడించిన ఘనత కూడా ఆయనదే. రాయడానికి, మాట్లాడటానికి చాలా తేడా ఉంటుంది. నా విషయానికి వస్తే రాసినంతగా మాట్లాడలేను. అప్పటికప్పుడు ఏదనిపిస్తే అది రాసినట్లుగానే, మాట్లాడినప్పుడు కూడా అంతే. తప్పులుంటే మన్నించేయండి...
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి