8, మే 2021, శనివారం
జీవన 'మంజూ'ష (మే)
ఒకప్పుడు ఆటపాటలకే పరిమితమైన వైల్డ్ కార్డ్ ఎంట్రీ నేడు ప్రతిచోటా తానేనంటోంది. కులమతాల్లో ఈ వైల్డ్ కార్డ్ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఇది ప్రతిభ ఏమాత్రం అవసరంలేని ఎంట్రీగా పరిగణింపబడటం విచారించదగ్గ విషయం. రాజకీయాలు, రాతకోతల్లో కూడ ఈ వైల్డ్ కార్డ్ కులమత ప్రాతిపదికన అధికారానికి, అవార్డులకు, రివార్డులకు వెన్నుదన్నుగా మారిందిప్పుడు.
అక్షరం ఎప్పుడూ గొప్పదే, కాకపోతే దాని విలువ తెలుసుకోగలిగే అర్హత మనకుండాలంతే. రాయడం, చదవడం, వినడం అనేవి మంచి లక్షణాలే. కాని మనలో ఎందరికున్నాయి ఈ మంచి లక్షణాలు. ఎంతసేపు మన రాతలు మాత్రమే గొప్పవి, పరాయివాళ్ళకెవరికీ అసలు రాయడమే రాదనుకునేంత దొడ్డ మనసు చాలామందిది. వీటికి తోడు ఈ మధ్యన సాహిత్యంలో కూడా సెల్ఫ్ ప్రమెాటింగ్ ఎక్కువై వెగటు పుట్టిస్తోంది. వ్యక్తిగత ప్రచారం అవసరమే కాని, దాని చాటున కూడ కులమనే వైల్డ్ కార్డ్ వాడాలనుకోవడమే తప్పు.
సాహిత్యంలో అనాది నుండి అన్ని వాదనల వేదనలు పురుడు పోసుకున్నాయి. పలానా సాహిత్యం పలానావాళ్ళే రాయాలన్న నియమమే ఉంటే ఓ బోయవాడి చేతిలో రామాయణం జనియించేదా! మత్స్యకన్నెకు పుట్టిన వ్యాసుడు భారతం చెప్తే వినాయకుడు రాసేవాడా! భగవదనుగ్రహం లేనిదే ఏ విద్యా ఎవరికి దక్కదు. మన గతజన్మ కర్మానుసారమే ఫలితం ఉంటుంది. ఈర్ష్యాసూయలు వదిలి ప్రతిభను ప్రోత్సహించ గలగడం మనిషిగా మన కర్తవ్యం.
అమ్మ నేర్పిన అక్షరం మనకు మరో అమ్మే. అక్షరాన్ని అవహేళన చేసినా, అవమానించినా మన అమ్మను అవమానించినట్లే. దయచేసి అక్షరాలకు కులమత, రాజకీయాలు అంటగట్టకండి. ఎదుటివారి అభిప్రాయాలకు కూడా కాస్త విలువనిస్తూ మీరు మానవత్వమున్న మనుషులే అని గుర్తు చేసుకోండి. మన చేతి అక్షరం సగర్వంగా నలుగురి మెప్పు పొందాలి కాని మనని కన్నవారు కూడ మన రాతలు చూసి సిగ్గుపడే విధంగా అక్షరాన్ని చేయవద్దని మనవి. నీ రాత నలుగురికి నచ్చితే చాలు, కాని ఆ రాత మరో నలుగురు బాధ పడేలా ఉండకూడదు. మనం ఏం రాసినా ఎవరిని కించపరచకుండా రాయగలిగితే చాలు. అదే మన రాతలకు సార్థకత.
వర్గము
ముచ్చట్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి