19, మే 2021, బుధవారం

నిజం..!!

నేస్తం, 
        ప్రపంచ బాధలన్నీ తమవనుకునే మహనీయులందరు గొప్పవారే జనం దృష్టిలో. ఇది అందరం ఒప్పుకోవాల్సిన నిజం. కాని ఈ మహామహులలో కొందరు కుటుంబాలను ఏర్పరుచుకుని, వారిని గాలికి వదిలేసి పేరు కోసమెా, అధికారం కోసమెా, లేదా మరో ప్రయెాజనం కోసమెా సంఘం సంస్కరణ, లేదా సమాజ ఉద్దరణ అన్న ముసుగులో ప్రజలను మెాసం చేసిన చరిత్ర లేదంటారా? నీతిగా, నిజాయితీగా బతకడానికి వీరందరు వివేకానందుని గుణగణాలు అంది పుచ్చుకోనూ లేదూ. ఆయనకున్న విలువలు, బాధ్యతలు వీరికి అవసరమూ లేదు. ఇది ప్రపంచ చరిత్రలో మనకు తెలిసిన అతి పాతదైన నిజం. 
       ఇదే కోవలో చాలా మంది ప్రబుద్ధులు (ఆడ/మగ) వారు పెరిగిన పెంపకం కాని, ఆయా పరిస్థితుల ప్రభావం కానివ్వండి చాలా అభద్రతాభావంతో పెరిగి, వారికున్న ఆ లోపాన్ని బయటకు తెలియకుండా ఉండటానికి సమాజానికి మేలు చేస్తున్నట్టు నటిస్తూ, వారికి వారే గొప్పదనాన్ని ఆపాదించేసుకుని బతికేస్తుంటారు. 
     ఇలాంటి వారికి కర్మ చాలక పెళ్లి, పిల్లలు ఉంటే, ఆ కుటుంబం కూడా నలుగురిలో గొప్పగా చెప్పుకోవడానికి ఓ స్టేటస్ సింబల్ గానే పనికి వస్తుంది తప్ప బంధాలు, బాధ్యతలు అన్న పదాలకు అర్థం తెలియని మూర్ఖులు. ప్రపంచంలో అందరి బాధలు వీరికి కావాలి కాని తనకు జీవితమిచ్చిన కుటుంబం మాత్రం ఆగర్భ శత్రువు. వీరికి అందరి ఆరాలు కావాలి. వీరు మాత్రం అంతా దాపరికమే. మరి ఎందుకో ఇలాంటి చీకటి బతుకులు కొందరివి. బయటికి వెళితే కనీసం చెప్పరు, కాని మిగతా ఇంట్లోవారు అడుగు బయటకు పెడితే సవాలక్ష ప్రశ్నలు. ఇలాంటి వారితో కలిసి బయటకు వెళ్లడానికి కూడా ఇంట్లోవారు భయపడతారు. ఎందుకంటే వీరి అభద్రతాభావాన్ని దాచుకోవడానికి బయటివారి ముందు ఇంట్లోవారిని చులకన చేస్తారు. అది వారి పరువు వారే తీసుకుంటున్నారని గ్రహించలేని మూర్ఖులు. 
       తెల్లారి లేచింది మెుదలు అందరి క్షేమసమాచారాలు కనుక్కోవడం మంచిదే కాని కనీసం ఇంటి అవసరాలు కాని, ఇంట్లోని వారి ఆరోగ్యం కాని, పిల్లల మంచి చెడ్డలు కాని వీరికి అవసరం లేదు. బయటకు ఎక్కడకు వెళ్లేది చెప్పకున్నా, కనీసం భోజనానికి వస్తారో రారో కూడా చెప్పాలన్న ఇంగితజ్ఞానం లేని పెద్ద మనుషులు వీరు. అడిగితే నోరుందని అరవడం, నెలా, రెండు నెలలు, మూడు నెలలు ఇంటి అవసరాలు పట్టించుకోకుండా తమ తిండి తాము చూసుకునే రకాలు కోకొల్లలు. మనం బయటకు వెళితే వేలు లేకుండా కదలం. లక్షలు లక్షలు తీసుకువెళ్ళడం తెలుసు. అవి ఎవరికి ఇస్తుంటారో మూడో కంటికి తెలియదు. కాని ఇంటి అవసరాలకు ఇవ్వడం తెలియదు.100 రూపాయలు ఇచ్చి 100 కోట్లు ఇచ్చినట్టు ఫీలయిపోతారు. పోని ఇంటి అవసరాలకు మనం ఎక్కడయినా డబ్బు తెచ్చి వాడినా, అవి వారు వాడుకున్నా కూడా వారికి సంబంధం లేనట్టుగా ప్రవర్తిస్తారు. దూరాన ఉన్న చదువుకునే పిల్లలను కూడా ఇలాగే ఇబ్బందులకు గురి చేస్తుంటారు. నాలుగు రోజులు ఇస్తే నాలుగు రోజులు ఇవ్వరు. నెల ఖర్చులు కనీసం ఇవ్వాలి కదా. ఇదంతా వారు పెరిగిన పెంపకం, వాతావరణం ఫలితం. వీరికి ఎంత అహంకారమంటే వీరు చెప్పిందే వేదమనాలి. తానా అంటే తందాన అనాలి. లేదంటే అరుపులు, గొడవలు చేస్తూ తమ పంతాన్ని నెగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు. 

    వినేవారుంటే ప్రపంచంలో నీతి సూత్రాలన్నీ అందరికి చెప్తారు. కాని తామెంత వరకు పాటిస్తున్నారో చూసుకోరు.

దయచేసి ఇలాంటి సమాజోద్ధారకులందరూ పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉండండి. ఇంటివాళ్ళని ఏడిపించి మీరేం బాగుపడరు. రేపన్న రోజు మీరు పోతే సమాజం మీకు నీరాజనం పడుతుందో లేదో తెలియదు కాని ఇంటివారు మాత్రం శని వదిలిందని సంతోషపడే బతుకు దయచేసి బతకకండి.

మీకు మనస్సాక్షి ఉంటే తరచి చూసూకోండి...నా మాటల్లో నిజముందో లేదో...!! 


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner