31, మే 2021, సోమవారం

కాలం వెంబడి కలం..56
          కాస్త సిటీ గ్రూప్ లో వర్క్ చేసినప్పుడు అప్పులు చాలా వరకు తీరిపోయాయి. ఈయన నా క్రెడిట్ కార్డ్ ల నుండి కొంత డబ్బు తీసి, మిగతా అమౌంట్ కలిపి ఓ రెండు సైట్లు విజయవాడలో తీసుకోమంటే మా మామయ్య తీసుకున్నాడు. అప్పటికే స్కార్పియెా కూడా లోన్ మీద తీసుకున్నారు. అంతకు ముందే ఈయన వాళ్ళ బావకి ఓ 3.5 లక్షలు ఇచ్చారు. చెల్లెలి పెళ్ళి కి ఓ లక్ష ఇచ్చాము. పెళ్ళి కుదర్చడం నా మెుదటి తప్పు. ఈయన మరదలికి H1B చేయించడానికి నాకు తెలిసిన శామ్ కి 2000 డాలర్లు కట్టి, వీసా క్వరీ పడితే అది క్లియర్ చేయించి, తమ్ముడికి, మరదలికి, వాళ్ళబ్బాయికి అమెరికా రావడానికి వీసా స్టాంపిగ్ ప్రాసెస్ చేయించాను. ఇది నా రెండో తప్పు. 
వాళ్ళు ముగ్గురు అమెరికా వస్తూ, మా చిన్నోడు శౌర్య కూడా వస్తానంటే తీసుకు వచ్చారు. వీళ్ళు వచ్చేటప్పటికే మా ఇంట్లో మా సుబ్బారావు అంకుల్ కొడుకు MS చేయడానికి అమెరికా వస్తున్నాడని నాన్న చెప్తే, వాడిని మేము పికప్ చేసుకుని, పంపిస్తామని చెప్పాము. వాడు హంట్స్విల్ వచ్చాడు. మా పక్కింటి రెడ్డి అంకుల్ తో మాట్లాడి వాడికి A&M యూనివర్శిటీకి మార్చమని చెప్పాము. వాడిని వేరే యూనివర్శిటీకి కౌన్సెలింగ్ రోజుకి తీసుకువెళ్ళి, వాళ్ళతో మాట్లాడి, ఇక్కడికి మార్పించాము. వాడితో పాటు రాజు అని వాడి ఫ్రెండ్ కూడా మా ఇంట్లోనే ఉండేవాడు. మా ఇల్లు ఎప్పుడూ జనంతోనే ఉండేది. చాలా తక్కువ టైమ్ ఎవరూ లేకుండా ఉన్నది. ఎంతమంది ఉన్నా కష్టమని ఎప్పుడూ అనుకోలేదు మేము. సందడిగా ఉందని సంతోష పడేవాళ్ళం. 
         అప్పటికే నా ఇంజనీరింగ్ క్లాస్మేట్ శ్రీనివాసరెడ్డి ఫామిలీ కొన్ని నెలలు మా ఇంట్లో ఉండి, తర్వాత వేరే ఇల్లు తీసుకుని ఉండేవారు. 
                 వీళ్ళందరి కన్నా ముందు విష్ణు వాళ్ళ తమ్ముడు అనిల్ కూడా కొన్ని రోజులు ఉన్నాడు. తర్వాత తను వేరే చోటికి వెళిపోయాడు. అప్పటి నుండి విష్ణు వాళ్ళు నాతో మాట్లాడటం మానేసారు. నాకు సిటి గ్రూప్ ప్రాజెక్ట్ తర్వాత వెంటనే మరొక ప్రాజెక్ట్ వచ్చింది. కాని జాయిన్ కాలేదు. అప్పటికే కాస్త హెల్త్ ప్రోబ్లంగా ఉంది. దేవుడికి డబ్బులు ఇచ్చానని కొందరు మనం అంత ఇచ్చేపాటివారమా అని, అదని, ఇదని ఈయనకు చెప్పడం. అప్పటికే వాళ్ళ తమ్ముడి ఫామిలీ ఇండియా లో మా ఇంటికి వెళ్ళి, అక్కడ మా ఇంట్లో అందరు కలిసుండటం చూసి, ఈయనకు ఏదోకటి చెప్పడం మెుదలు పెట్టినట్టున్నారు. అవన్నీ మనసులో పెట్టుకుని మగవాడి అహంకారం బాగా చూపించాడు. అప్పుడు కాని నాకర్థం కాలేదు. ఈయన మనసులో ఆ చెప్పుడు మాటల ప్రభావం ఎంతగా పాతుకుపోయిందో. 
            ఈయన చిన్న విషయానికి బాగా గొడవ పెట్టుకున్నాడు. ఏదో ఫోటో పిల్లలది ఈయనది ఉంటే ఎన్లార్జ్ చేయిద్దామంటే, రడీ అవమంటే నేను రడీ అయ్యి వచ్చేసరికి ఈయన ఫోన్ లో గుడగుడా మాట్లాడుకుంటున్నాడు. నేను రాగానే ఫోన్ పెట్టేసాడు. మా అమ్మతోనే అనుకుంటా మాట్లాడింది. మనం వినకూడదనుంటే, ఆ ఫోన్ మాట్లాడేటప్పుడు పక్కనే ఉన్నా ఓ అక్షరం కూడా అర్థం కాకుండా మాట్లాడే టాలెంట్ ఈయనది. నేనేమెా నా పక్కనే గట్టిగా అరచినా కూడా నాకు అనవసరం అనుకుంటే ఓ ముక్క కూడా చెవికి ఎక్కించుకోను. అలా చూసి చూసి బాగా అప్పటికే చాలా సంవత్సరాలుగా గమనించిన చిరాకుతో సీక్రెట్స్ మాట్లాడటం అయ్యిందా అని మామూలుగానే అన్నా.  వెంటనే అప్పటికే తన మనసులో నా మీద ఉన్న అక్కసునంతా ఈయన చేతులతో, కాళ్ళతో నేను ఎప్పటికీ మర్చిపోలేనంతగా చూపించాడు. అంతకు ముందు కూడా చాలాసార్లు ఇలాంటివే జరిగాయి కూడా. శౌర్య డెలివరీ ముందు కూడా ఇలాగే చేయి, కాలు కూడా లేచింది, అడపాదడపా కాని దెబ్బ పడలేదు. చీటికిమాటికి పోట్లాడి అలగడం, వేరే వండుకు తినడం, లేదా బయట తినడం ఇవన్నీ నాకు మామూలే. ఏది జరిగినా అమ్మావాళ్ళకు నేనెప్పుడూ చెప్పేదాన్ని కాదు. ఫోన్ చేసి మరీ తన ఘనకార్యాలు చెప్పుకునేవాడు. అమ్మానాన్న లేరు కదా, అడపాదడపా అక్కాబావా దగ్గర పెంపకం. ఆ ఇంట్లో ఆ ఇంట్లో పెరిగాడు. ఇన్ఫీరియారిటి, అదే టైమ్ లో వారి అక్కకున్న సుపీరియారిటి కాంప్లెక్స్ తనకు కూడా అబ్బి, ఎప్పుడూ పోట్లాటల మధ్యన పెరిగిన వాతావరణం, తన చుట్టూ ఉన్న పరిసరాలు కల్పించిన అభద్రతా భావమని సరిపెట్టుకునే దాన్ని.  ఈ సంఘటనజరిగినప్పటికి మా ఎదురువాళ్ళు మాత్రమే ఉన్నారు. మా ఇంట్లో వీళ్ళెవరూ లేరు. 
మా మరిది వాళ్ళు వచ్చిన కొన్ని రోజులకు శ్రీనివాసరెడ్డి వాళ్ళు వేరే చోటికి వెళిపోయారు. 
ఇక మా మరిది వాళ్ళు వచ్చాక అసలు సినిమా మెుదలైంది. 

" నిజాయితీగా చెప్పాలంటే స్వ'గతాన్ని మించిన మంచి కథను ఎవరూ చెప్పలేరు. "

వచ్చే వారం మరిన్ని కబుర్లతో.... 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner