30, మే 2021, ఆదివారం
గట్టు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ చరిత్ర..!!
ఎవరి కయినా పుట్టిన ఊరి మీద మమకారం ఉండటం సహజమే. ఆ ఊరి అందాలను, తామనుభవించిన అనుబంధాల ఆప్యాయతలను, ఆనందాలను నలుగురితో పంచుకోవడం మహదానందమే కొందరికి. ఆ కోవలోనికే వస్తారు మన డాక్టర్ లక్ష్మీ రాఘవ. సమకాలీన సమాజంలోని మానవ రుగ్మతలపై, రోజూ మన చుట్టూ జరిగే ఎన్నో సమస్యలను ఏ ఊహలతో జోడించకుండా, సూటిగా స్పష్టంగా తను చెప్పాలనుకున్న విషయాన్ని పాఠకుల మనసులోనికి చొచ్చుకుని పోయేటట్లుగా రాయగలిగే లక్షణం వీరిది. ఇప్పటికే బోలెడు కథల సంపుటిలు, బహుమతులు గెలిచిన కథలు, ఎన్నో పురస్కారాలు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. వీరి చేతి కళా నైపుణ్యంలో పనికిరాని వస్తువులు కూడా అందంగా రూపుదిద్దుకుని చూపరుల్ని ఇట్టే ఆకర్షించేస్తాయి. అందమైన ఆకృతుల తయారీనే కాకుండా,సుందరమైన చిత్రాలు వేయడంలోనూ దిట్టే.
తన పుట్టింటి ఊరినే కాకుండా, అక్కడి దేవునితో తనకు గల అనుబంధాన్ని, ఆ దేవుని వెనుక చరిత్రను, మూలవిరాట్టు గొప్పదనాన్ని, ఉత్సవాలను, వాటి నిర్వహణను, మహిమలను మెుదలైన ఎన్నో విశేషాలను మన అందరితో పంచుకోవడానికి, సేకరించిన సమాచారాన్ని అందరికి అందించాలన్న సత్ సంకల్పంతో ఓ చిన్న ప్రయత్నంగా మెుదలుబెట్టిన పుస్తకమే " గట్టు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ చరిత్ర ".
ఈ పుస్తకంలో ముందు మాటగా తను చెప్పాలనుకున్న విషయాలను చెప్పి, ఆలయ ధర్మకర్తలు, దేవుని స్తుతి పంచకం, దేవాలయ చరిత్ర, తిరుణాల ఉత్సవం, గట్టు వేంకటరమణ స్వామి మహిమలు, స్వామి వారి అనుభవాలు, దండాలు సామి అంటూ చక్కని కవితతో అలరిస్తూ, సప్త బుుషుల స్తుతితో, చివరిగా శ్రీ వేంకటేశ్వరుడి అష్టోత్తర శతనామావళితో హృదయపూర్వక భక్తి శ్రద్ధలతో మనసావాచా దైవాన్ని నమ్మకంగా నమ్మి, తన అక్షరాలతో చదువరులకు స్వామి వారి చరిత్రను బహు సుందరంగా చూపించారు.
ఇంత చక్కగా తమ ఊరి దైవాన్ని తరతరాలకు పుస్తక రూపంలో అందించి, తమ జన్మను ధన్యం చేసుకున్నారు డాక్టర్ లక్ష్మీ రాఘవ. సనాతన సంప్రదాయాల విలువలు, గొప్పదనము, మనిషిగా మనమేంటో తెలుసుకోవాల్సిన ఈ సమయంలో ఈ చక్కని పుస్తకాన్ని అందించింనందుకు డాక్టర్ లక్ష్మీ రాఘవ గారికి హృదయపూర్వక అభినందనలు. స్వామి వారి గురించి ఇలా రాసే అవకాశం నాకందడం కూడా పూర్వజన్మ సుకృతమే. ఈ అవకాశం నాకిచ్చినందుకు డాక్టర్ లక్ష్మీ రాఘవ గారికి మనఃపూర్వక ధన్యవాదాలు.
ఈ దేవాలయాన్ని, స్వామి వారిని ప్రత్యక్షంగా దర్శించాలనుకుంటే..
గట్టు గ్రామం
బి. కొత్తకోట మండలం,
చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్,
పిన్ కోడ్ 517326
వర్గము
సమీక్ష
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి