తెలుగు సాహిత్యమునకు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది. తెలుగు సాహిత్యం
ఎంతో సుసంపన్నమైనది.
ఆధ్యాత్మికములోనైనా, శృంగారాది నవరసములలోనైనా, జాతిని
జాగృతం చేయు విషయంలోనైనా, తెలుగువారందరూ గర్వపడేటంత విశేషమై
వెలుగొందుతున్నది తెలుగు సాహిత్యం. నన్నయ్య వ్రాసిన భారతము తెలుగులో మొదటి కావ్యము. అంతకు ముందే జానపద గీతాలు, కొన్ని పద్యాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. గాధా సప్తశతి లో తెలుగు జానపద గీతాల ప్రస్తావన ఉన్నది. అందుకే ఇప్పటికి జన పదాలైన జానపదాలు అందరికి అత్యంత ఇష్టంగా ఉంటున్నాయి... మనకు తెలియకుండానే మనతో సాహిత్యం ఎంతగా ముడి పడి పోయిందో కాస్త సాహిత్యం గురించి తెలుసుకునే ప్రక్రియలోనే తెలియని ఎన్నో విషయాలు వెలికి వస్తున్నాయి... మన తెలుగు సాహితీ ముచ్చట్లలో మరికొంత తెలుగు సాహిత్యం గురించి తెలుసుకునే ముందు మనం వారం వారం చెప్పుకుంటున్న పద్య లక్షణాలలో కొన్ని ముఖ్యమైన వృత్తాల గురించి చర్చించుకున్నాము... ఈ వారం ఇక జాతుల విషయంలోనికి వస్తే...
జాతులు
జాతులు మాత్రాగణములతో మరియు ఉపగణములతో శోభిల్లును. జాతులకు కూడా యతి, ప్రాస నియమములు ఉన్నాయి.
- కందం
- ద్విపద
- తరువోజ
- అక్కరలు (మహాక్కర, మధ్యాక్కర, మధురాక్కర, అంతరాక్కర అల్పాక్కర)
- ఉత్సాహము
ఈ వారం మనకు తెలిసిన కందం, ద్విపదల గురించి చూద్దాం...
కందం
తెలుగు పద్యాలలో అత్యంత అందమైన పద్యంగా కందాన్ని పేర్కొంటారు. ఈ పద్యపు
లక్షణాలు చూడటానికి కష్టంగా కనిపించినా ఇందులోని గణాలన్నీ నాలుగుమాత్రల
గణాలు కావడం వలన, ఈ పద్యం నడక సులువుగా పట్టుబడుతుంది. సుమతీ శతకములోని
పద్యాలన్నీ కందపద్యాలే.
క. కందము త్రిశర గణంబుల, నందము గా భ జ స నలము లటవడి మూటన్
బొందును నలజల నాఱిట, నొందుం దుద గురువు జగణ ముండదు బేసిన్
యిందు గణములు
కంద పద్యములో ఉండవలసిన గణములు
గ గ |
భ |
జ |
స |
నల |
U U |
U I I |
I U I |
I I U |
I I I I |
లక్షణములు
- పాదాలు: 4
- కందపద్యంలో అన్నీ నాలుగు మాత్రల గణాలే ఉంటాయి. గగ, భ, జ, స, నల ఇవీ ఆ గణాలు
- 1,3 పాదాలలో గణాల సంఖ్య = 3
- 2,4 పాదాలలో గణాల సంఖ్య = 5
- 1,3 పాదాలలో 1,3 గణాలు జ గణం కారాదు.
- 2,4 పాదాలలో 2,4 గణాలు జ గణం కారాదు.
- 2,4 పాదాల్లో మూడో గణం (యతికి ముందు వచ్చేది) జ కాని, నల కానీ అయి ఉండాలి.
- 2,4 పాదాలలో చివరి అక్షరం గురువు. అంటే చివరి గణం గగ లేదా స అయి ఉండాలి.
- పద్యం లఘువుతో మొదలైతే అన్ని పాదాలు లఘువుతో మొదలవ్వాలి. గురువుతో మొదలైతే అన్నీ గురువుతో మొదలుకావాలి.
- యతి: 2,4 పాదాలలో మొదటి అక్షరానికీ నాలుగవ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి కుదరాలి
- ప్రాస: ప్రాస పాటించాలి, ప్రాస యతి చెల్లదు
ఉదాహరణ 1
నడువకుమీ తెరువొక్కట
గుడువకుమీ శత్రు నింట గూరిమి తోడన్
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ!
ఉదాహరణ 2
భూతలనాథుడు రాముడు
ప్రీతుండై పెండ్లి యాడె బృథుగుణమణి సం
ఘాతన్ భాగ్యోపేతన్
సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్
ఉదాహరణ 2 కు గణములు లెక్కిస్తే
భ |
భ |
భ |
|
|
భూ త ల |
నా థు డు |
రా ము డు |
|
|
గ గ |
గ గ |
జ |
నల |
స |
ప్రీతుం |
డై పెం |
డ్లి యాడె |
బృథుగుణ |
మణి సం |
గ గ |
గ గ |
గ గ |
|
|
ఘాతన్ |
భాగ్యో |
పేతన్ |
|
|
గ గ |
స |
నల |
స |
గ గ |
సీతన్ |
ముఖకాం |
తి విజిత |
సితఖ |
ద్యోతన్ |
కంద పద్యమునందు గణముల వివరణ
భ గణము = UII { గురువు, లఘువు, లఘువు }
గగ గణము = UU { గురువు, గురువు }
జ గణము = IUI {లఘువు,గురువు, లఘువు }
నల గణము = IIII {లఘువు, లఘువు, లఘువు, లఘువు }
స గణము = IIU {లఘువు, లఘువు, గురువు}
ద్విపద
ద్విపద తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యరీతి. పద్యం కంటె ద్విపద సామాన్య ప్రజలకు మరింతగా చేరువవుతుంది. తెలుగు సాహిత్యంలో భారత, భాగవత, రామాయణాలు ద్విపద కావ్యాలుగా రచించబడ్డాయి.
లక్షణములు
ఇంద్ర గణములు మూఁ డిన గణంబొకటి చంద్రాస్య ! ద్విపదకుఁ జను చెప్పరేచ
ద్విపదకు ద్విపదకుఁ దెగ జెప్పవలయు నెపుడు సంస్కృతమున నితర భాషలను
యతుల లోపలఁ బ్రాసయతి దక్క సకల యతులు చెల్లును బ్రయో గాతి సారమున
ద్విపద తో ద్విపద సంధిల నేకశబ్ద
మపుడు రెంటను గూర్ప నది యయుక్తంబు
- ఈ పద్యానికి రెండు పాదాలు మాత్రమే ఉంటాయి (అందుకే దీనిని ద్విపద అంటారు)
- ప్రతిపాదములోనీ మూడు ఇంద్ర గణాలు, ఒక సూర్య గణము ఉంటుంది.
యతి
యతి: మూడవ గణం యొక్క మొదటి అక్షరం.
ప్రాస
ప్రాస: ప్రాస ఉన్న ద్విపదను సామన్య ద్విపద, అదే ప్రాస లేకుండా ద్విపద వ్రాస్తే దానిని మంజరీ ద్విపద అని పిలుస్తారు.
- జాతి(ద్విపదలు) రకానికి చెందినది
- 11 నుండి 15 అక్షరములు ఉండును.
- 2 పాదములు ఉండును.
- ప్రాస నియమం కలదు
- ప్రతి పాదమునందు 3 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
- ప్రతి పాదమునందు మూడు ఇంద్ర , ఒక సూర్య గణములుండును.
ఉదాహరణలు
గోన బుద్దారెడ్డి రచించిన రంగనాథ రామాయణము.
||ద్విపద ||
అపరిమిత ప్రీతినా భగీరథుని
తపమిచ్చమెచ్చనే కందర్ప సంహరుని
గణాలు లెక్కిస్తే...
అపరిమి =ఇంద్ర గణము
తప్రీతి = ఇంద్ర గణము
నాభగీ = ఇంద్ర గణము
రధుని = సూర్య గణము
యతి అక్షరాలు
'''అ'''పరిమిత ప్రీతి'''నా''' భగీరథుని
ప్రాస "ప" అక్షరమ్.
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....