చెప్పాల్సిన మాటలు...!!
నేస్తం,
మనిద్దరమే మాట్లాడుకోవాల్సిన సమయం దగ్గర పడిందనుకుంటా. అనుకోకుండా జత పడిన అనుబంధానికి విధిరాతంటూ పేరు పెట్టుకోవడం సహజమే. పంతాలకో పట్టింపులకో ముడి పడింది ఈ బంధం. అప్పుడనుకోలేదు పాతికేళ్ళ సంతోషాలు ఆవిరై రానురానూ కన్నీళ్లు కూడా ఇంకిపోతాయని. పంతాలకు పోయి ముడిబెట్టిన మూడోరోజే ఖర్చుల పద్దు అప్పజెప్పినా కిమ్మనలేదు. కొన్ని నెలలకే యుగాల అనుభవాన్ని అందించినా భయపడలేదు. ఆ కొన్ని నెలలు కూడా ఊడిగానికి ముద్ద మనిద్దరికి వేసారన్నది సత్యం.
కొన్ని రోజులకే అదుపులో పెట్టుకోవడం రాలేదని, అదనీ ఇదనీ వారి అసహనాన్నంతా నామీద చూపించినా, బాధ్యతాయుత వృత్తిలో ఉన్నవారి నుండి అభ్యంతరకర పదజాలం అప్పుడే వినడం మెుదటిసారైనా, పోనీలే బిడ్డలేని ప్రస్ట్రేషన్ అనుకుంటూ..అహం రూపాన్ని అందంగా చూపించినా, పోనిలే అమ్మలాంటిదనే సరిపెట్టుకున్నా. ప్రతిదీ అంక్షల పర్వమే. అదేమంటే పద్ధతి గురించి చాలా పద్ధతిగా వివరించేవారు. ఇలాంటివి ఇంకా చాలా నీకూ అనుభవమేగా వారి నుండి. ఎన్నిసార్లు ఇంటి నుండి బయటకు పంపారో, ఎందరి దగ్గర ఆశ్రయం పొందావో ఇప్పుడు నీకు గుర్తు లేకున్నా నాకన్నీ గుర్తే.
ఆ పెంపకానికి అలవాటు పడిన నువ్వు అప్పటి వరకు ప్రశాంతంగా రూపాయి లేనప్పుడు కూడా దర్జాగా,పరువుగా బతికిన మా బతుకులతో అప్పటి నుండి ఇప్పటి వరకు నువ్వు, నీవాళ్ళు కొందరు ఆడుతున్న ఆటలు నీకు మీ వారి నిజాయితీలా అనిపించాయి కదా.
పదకొండు రోజుల పసిబిడ్డతో ఆపరేషన్ చేసిన పచ్చి బాలింతను రోడ్డు మీదకు పంపిన ఆ సంస్కారానికి చేతులెత్తి మెుక్కాలి మరి. రెండేళ్ళ పసిబిడ్డ చావుబతుకుల మధ్య కొట్లాడుతుంటే కనీసం చూడాలని కూడా అనిపించని ఆ మహోన్నత మనసులకు పాదాభివందనం. ఈరోజు ఎవరు పలకరించినా, పలకరించకున్నా కొత్తగా నాకు, నా బిడ్డలకు ఒరిగేదేం లేదు. నీ భార్యను మీవారంతా ఓ పదిహేను సంవత్సరాలు వెలివేసినా, నిన్ను పిలిచారు చాలని పెళ్లిళ్ళకు, పేరంటాలకు చక్కగా హాజరయిన నీకు భార్యాపిల్లలు, కుటుంబం అంటే ఎంత ప్రేమెా..!
అవసరాలకు డబ్బులు కావాలి కాని మనుషులు అక్కర్లేదని ఎన్నిసార్లు వారంతా బుుజువు చేసినా, నీకంటూ ఓ విలువను, గుర్తింపును ఇచ్చిన కుటుంబం నీకు ఆగర్భ శత్రువులు ఇప్పటికీ, ఎప్పటికీ, నీ భార్యాపిల్లలతో సహ. ప్రతి చిన్న సంతోషానికి పిలిచినా రాని నీవారి మంచితనం బహు గొప్పది. అన్నకు వదినను విడాకులు ఇమ్మన్న తమ్ముడు నీకు మంచివాడు. సొమ్ము తిన్నారు బాధ పడలేదు, పసి పిల్లాడిని నా దగ్గరకు రాకుండా చేసినా సహించాను. అమెరికా నుండి పసి పిల్లాడితో ఇండియా వస్తుంటే డాలర్ చేతికివ్వని నీకు కుటుంబం, బాధ్యత గురించి బాగా తెలుసు. పెళ్ళాం సంగతి సరే దాని జీవితం అయిపోయింది మీ పుణ్యమా అని. కనీసం పిల్లలతో ఓ మాటా, మంచి, వారి బాగోగులు చూడటం కూడా లేదు. అచ్చం ఆవిడలానే.
అమ్మబాబు పిల్లలు తప్పు చేసినా కడుపులో పెట్టుకు దాచుకుంటారు. కాని బిడ్డలను విభజించి పాలించాలనుకోరు. ఏనాడైనా మీ నలుగురితో కలిసున్న రోజు కనీసం ఒక్కరోజుందా..! చెల్లెలు బతికుండగా ఓ ముద్ద ఇంట్లో పెట్టలేదు కాని ఆ చావును కూడా వాడుకున్నారు. అమ్మతనం మనం ఆపాదించుకుంటే రాదు. మన పెంపకం ఆ విషయాన్ని తెలుపుతుంది. ఇలాంటి వాతావరంలో పెరిగిన నీకు కుటుంబం గురించి ప్రేమ ఉంటుందని ఇన్నాళ్లు అనుకోవడం నా అసలు తప్పు.
నిజాన్ని దాచి బతకాలనుకుంటే అది బయట పడకుండా ఉండదు. నటిస్తూ బతకడం ఓ బతుకు కాదు. ఇక్కడ ఎవరిని ఎత్తి చూపడం నా ఉద్దేశ్యం కాదు. ఇన్నాళ్లు ముసుగులో దాచిన నిజాల ముసుగు తీసే ప్రయత్నం చేస్తున్నానంతే. కూలి పని చేసి కూలి తీసుకునే నీవాడికి కాలం నాడే బైక్. పుట్టినరోజు పార్టీలు. అదే పిల్లల దగ్గరకు వచ్చేసరికి చేతులే రావు. ఎవరైనా నాకు తెలిసి వారికి జరగని సంతోషాలు పిల్లలకయినా చూడాలనుకుంటారు. కానీ నీలా.. అన్ని ముందే చెప్పి, అందరికి చెప్పుకున్న తర్వాత పిల్లల ఫంక్షన్ ఆపేయరు. కనీసం ఇప్పటికి అదే తంతు. నువ్వు ఎక్కడికి వెళ్లేది, ఏం చేసేది దాపరికం. పిల్లలు వస్తున్నారని మాకు తెలియకపోతే సర్ప్రయిజ్. అదే విషయం నీకు పిల్లలు చెప్పకపోతే అది తప్పు. చదువుకునే పిల్లలకు వారి అవసరాలు గమనించి చూసుకోవాలి. కానీ మనం లెక్కలేసుకుంటాం పిల్లల విషయంలో. లక్షలు డ్రా చేసి బయట ఇచ్చి వస్తాం కాని అడగకూడదు. ఓ నేల చూపుల ముచ్చు ముఖం వెధవ వాడి స్వార్థానికి వాడుకుని, కష్టార్జితాన్నంతా ఓ దరిద్రుడి పాలు చేయిస్తే వాళ్ళంతా నీకు దేవుళ్ళు.
ఊరికి మంచి చేయడం మంచిదే. కనీసం కుటుంబం పరిస్థితి చూసుకుంటూ ఏం చేసినా పర్లేదు. పెళ్లాం,పిల్లల ఆరోగ్యం గురించి తెలియదు కాని ఊరందరి క్షేమ సమాచారాలు మనకి అత్యవసరం. అదేమని అడిగితే రెండు, మూడు నెలలు ఇంటి అవసరాలు పట్టవు, లేదా పిల్లల అవసరాలు పట్టించుకోవు. ఊర్లో నీ పి ఏ లు ఆ ఇంటి మీద కాకి అరిచింది, ఈ ఇంట్లో పిల్లి పిల్లలు పెట్టింది.. వగైరా కబుర్లు క్షణాల్లో జారవేస్తారు. ఆయన ఆ ఇంటికెల్లాడు. ఈ ఊరెల్లాడు అని చాడీలు చెప్పడం మనం నోరుంది కదాని అరవడం. ఓ మహానుభావుడేమెా వారి పుత్రికే మన కుంటుంబాన్ని సంవత్సరాల తరబడి పోషిస్తోందని, మా నాన్నని ముసలాడు లంక వెళ్లాడని అలా ఇలా అందరి దగ్గరా వాగినా వారంతా నీ మేలు కోరేవారు. నీకు కావాల్సిన వారు.
ఈరోజు మనం ఇలా ఉన్నామంటే కారణం మా నాన్న. తనని మనం కాదన్నా తనేనాడు మనల్ని వదులుకోలేదు. అమెరికా పంపించింది, ఆ ఖర్చులు భరించింది ఎవరో అందరికి తెలుసు. నీవారు కొందరు ఈరోజు తినేది ఎవరి భిక్షో తెలియదా. సొంత చెల్లెలు చావుబతుకుల మధ్యనుంటే, ఆ చెల్లెలి మీద అన్నదమ్ముళ్ళకు చాడీలు చెప్పే కుసంస్కారంలోనూ, ఆ చెప్పుడు మాటలు నిజమని నమ్మే దరిద్రపు పెంపకంలోనూ మేము పెరగలేదు. నా పిల్లలు కూడా పెరగలేదు. కనీసం ఓ జుబ్బా కూడా ఎరగరు నా బిడ్డలు ఈనాటికి. కలిసున్న కుటుంబాన్ని చూడలేక చాడీలు చెప్పి విడదీసే నైజమున్న నీ రక్తబంధాలు, ఆ పాదాలు ఎక్కడ పడితే అక్కడ సర్వ నాశనమే. వయసు మీద పడినా మారని నీ మనస్తత్వం ఇదని తెలుసుకో. నువ్వేం నష్టపోయావో ఇంకా నీకు తెలియడం లేదు. నీ అవసరానికి ఎవరు నీ వెంట ఉన్నారో ఓసారి నీ మనస్సాక్షినడుగు.
నా బంధువులు మంచివారని అనను. ఇబ్బందిలో ఉన్నప్పుడు నా ఇంటి మీద నుండి వెళితే అప్పు అడుగుతానేమెానని వేరే వైపు నుండి వెళ్లినవారూ గుర్తే. 500 రూపాయల చిల్లర మార్చడానికి మా మంజు కొడుకుకి డబ్బులివ్వాలని పక్క ఊరంతా చెప్పిన సోదరులూ జ్ఞాపకమే. అమ్మా ఇప్పుడు నీకు మేమున్నామంటూ నోటి మాటలు చెప్పడమే కాని, కనీసం బాలేనప్పుడు ఓ పలకరింపుకి నోచుకోని కాదనుకోలేని అనుబంధాలూ నావే. పిల్లాడికి అవసరానికి డబ్బులడిగితే మా ఆయనకు ఆ విషయం చెప్పి, కనీసం ఈరోజుకి కూడా సమాధానం చెప్పని ఆత్మీయులు నావారని గర్వపడుతున్నా.
ఏ రక్త సంబంధం లేకున్నా స్నేహితుని కోసం, ఆ స్నేహితుని కూతురి బాధ్యత తీసుకుని తండ్రిగా తన మంచిచెడులు చూసిన నరసరాజు మంతెన అంకుల్, ఓ సంవత్సరం కలిసి చదువుకున్న పరిచయమే అయినా, అడగకుండా నా ఇబ్బంది తీర్చి, తను ఇబ్బంది పడిన నా ఆత్మీయ సోదరుడు రఘు, అవసరానికి కావాలని అడగగానే... అమ్మా నీ టెన్షన్స్ మాకు వదిలేయ్. నువ్వు సంతోషంగా ఉండు అన్న మా సోమయ్య పెదనాన్నకి మరో పది జన్మల వరకు బుుణపడి ఉంటాను. ఇంకా నేనీరోజు ఇలా ఉండటానికి కారణమైన నా శత్రువులకు, రాబంధువులకు కూడా మనఃపూర్వక ధన్యవాదాలు.
కొసమెరుపేంటంటే... " ఏ రోజు ఎవరిదో తెలియని ఈ కాలంలో కనీసం ఓ క్షణం అయినా మనతో మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. "